Private School Fees News In Odisha: Odisha Govt Reduces 15 Percent Fees In All Private Schools - Sakshi
Sakshi News home page

సంచలన నిర్ణయం తీసుకున్న ఒడిశా ప్రభుత్వం

Published Sat, Jun 5 2021 8:37 AM | Last Updated on Sat, Jun 5 2021 10:49 AM

Odisha Govt Reduces 15 Percent Fees In All Private Schools - Sakshi

భువనేశ్వర్‌: రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజులను 15 శాతం రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించి విద్యార్థుల తల్లిదండ్రులపై స్వల్పంగా భారం తగ్గించింది. ఫీజుల వసూలు ఒప్పందం సంతకం చేసిన వారు ఆ ప్రకారం ఫీజులు వసూలు చేస్తారు. ఇతరులు 15 శాతం ఫీజు రద్దు చేయాలని రాష్ట్ర పాఠశాలలు- సామూహిక విద్యా విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యా సంవత్సరం పొడవునా తరగతుల నిర్వహణపై కోవిడ్‌–19 ఆంక్షలు ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్లో ఫీజులు వసూలు చేయడం పట్ల తల్లిదండ్రుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శాంతియుత సంప్రదింపులు విజయవంతం కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది.  తల్లిదండ్రుల సంఘం అభ్యర్థనపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లేని, నిస్సహాయ స్థితిని తల్లిదండ్రుల సంఘం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ విచారకర పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు మూడు వర్గాలతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, తల్లిదండ్రుల సంఘం, ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం ప్రతినిధులతో రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటైంది.

కరోనా తాండవిస్తున్న పరిస్థితుల్లో పాఠశాలలు వసూలు చేస్తున్న వార్షిక ఫీజును పరిమితి మేరకు పలు అంచెలుగా ఖరారు చేసి అంచెల వారీగా ఫీజుల్లో మినహాయింపు కల్పించాలని హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలులో అసంతృప్తి తలెత్తితే తల్లిదండ్రుల సంఘం మరోసారి న్యాయం కోసం ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు కేసు విచారణకు తెరదించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పలు ప్రైవేట్‌ పాఠశాలలు అంచెల వారీగా ఫీజులు మినహాయించే ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాయి. ఈ వివాదం మరోసారి బిగుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ఒప్పందం నిరాకరించిన యాజమాన్యాలు 15 శాతం ఫీజులు రద్దు చేయాలని ఆదేశిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement