సాక్షి, అమరావతి: సాంకేతిక యుగంలోనూ భారతదేశంలోని మహిళలు పురుషుల కంటే సొంత సెల్‌ఫోన్ల వినియోగంలో వివక్ష ఎదుర్కొంటున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)–5 వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7,24,115 మంది మహిళలను ఇంటర్వ్యూ చేస్తే అందులో సగంమంది మాత్రమే తమకు ప్రత్యేకంగా సెల్‌ఫోన్ ఉందని చెప్పారు. వీరిలో 71 శాతం మందికి మాత్రమే టెక్ట్స్ మెసేజ్‌లు చదవగలిగే సామర్థ్యం ఉందని తేలింది. మహిళా సాధికారత అన్వేషణలో భాగంగా 15–49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఉపాధి, సంపాదనపై నియంత్రణ, యాజమాన్య హక్కులు, మొబైల్ ఫోన్ వినియోగంపై 2019–21 మధ్య ఈ సర్వే నిర్వహించారు.
అగ్రస్థానంలో గోవా
దేశవ్యాప్తంగా దాదాపు 66.29 కోట్ల్ల మంది మహిళలున్నారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5 సర్వేలో సొంత సెల్‌ఫోన్లు వినియోగిస్తున్న మహిళల్లో గోవా అగ్రస్థానంలో నిలవగా మధ్యప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. గోవాలో సర్వేచేసిన 2,030 మంది మహిళల్లో 91.2 శాతం మందికి సొంత ఫోన్లున్నాయి. మధ్యప్రదేశ్‌లో 48,410 మంది మహిళల్లో 38.5 శాతం మందికే ఫోన్లున్నాయి. తెలంగాణలో 60 శాతం మందికి సొంత ఫోన్లు ఉన్నాయి. సొంత సెల్‌ఫోన్లు వినియోగిస్తున్న మహిళల శాతం ఏపీలో 48.9గా ఉంది. దేశవ్యాప్తంగా 2015–16 సర్వేతో పోలిస్తే తాజా గణాంకాలు మెరుగుదలను సూచిస్తున్నాయి. సొంత ఫోన్లు ఉన్న మహిళలు గతంలో 46 శాతం ఉండగా అది ఇప్పుడు 54 శాతానికి చేరింది. ఈ వృద్ధి నెమ్మదిగా ఉండటంతో కొందరు నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సిక్కిం, లక్షద్వీప్, పుదుచ్చేరి, నాగాలాండ్, మిజోరంతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి.
వయసును బట్టి..: ఈ సర్వే ప్రకారం మహిళల్లో సొంత సెల్‌ఫోన్ల వినియోగం వయసును బట్టి పెరుగుతోంది. 15–19 ఏళ్ల వయసు గల యువతుల్లో 32 శాతం ఉంటే.. 25–29 ఏళ్ల మహిళల్లో 65 శాతానికి పెరిగింది. సొంత మొబైల్ ఫోన్ ఉన్న మహిళల్లో టెక్ట్స్ మెసేజ్ చదివే సామర్థ్యం వయసు పెరిగే కొద్దీ తగ్గుతోంది. ఇది 15–19 సంవత్సరాల వయసు గల వారిలో 89 శాతం ఉంటే.. 40–49 సంవత్సరాల వయసు గల వారిలో 53 శాతానికి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment