
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లు తీవ్ర దుమారానికి దారితీస్తోంది. బిల్లులపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులు ఆదివారం రాజ్యసభకు రావడంతో ఉదయం నుంచీ వాడీవేడి చర్చ జరుగుతోంది. రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. బిల్లు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. (రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లులు)
దీనిలో భాగంగానే డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు. టీఎంసీ, ఆమ్‌ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకులు విరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది. దీంతో సభలో ఓటింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా పడింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు వ్యయసాయ బిల్లులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment