
శ్రీనగర్/జమ్మూ: గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది మిలిటెంట్లు సరిహద్దు అవతల వేచి చూస్తున్నట్టు సమాచారం అందిందని కశ్మీర్ బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ సోమవారం తెలిపారు. చొరబాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సరిహద్దు వెంబడి గస్తీ పెంచామని చెప్పారు. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. తాలిబన్ల ముప్పు, అఫ్గానిస్తాన్ నుంచి కశ్మీర్‌కు ఆయుధాలు సరఫరా అవుతాయనే వార్తలపై స్పందిస్తూ.. ఇప్పటివరకైతే అలాంటి సమాచారమేం లేదన్నారు. అయినా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, నిఘా పెంచామని చెప్పారు. కొంత మంది గైడ్‌లు నియంత్రణ రేఖ దాటి అవతలివైపునకు వెళ్లారని.. ఇటువైపు వచ్చాక వాళ్లపైన, వాళ్ల కుటంబాలపైనా నిఘా పెడతామన్నారు.
యాంటీ డ్రోన్ పద్ధతులు వాడుతున్నాం
సరిహద్దులో డ్రోన్ల సమస్య ఉందని, గతేడాది కూడా కొన్ని తమకు కనిపించాయని, అయితే మనవైపు రాలేదని ఐజీ వివరించారు. ఈ ఏడాది యాంటీ డ్రోన్ పద్ధతులను వాడుతున్నామని, డ్రోన్లు కూడా సమకూర్చుకుంటున్నామని తెలిపారు. సరిహద్దు అవతలివైపు నుంచి నార్కోటిక్ డ్రగ్స్ పంపేందుకు ప్రయత్నిస్తున్నారని, కొన్నింటిని ఇప్పటికే సీజ్ చేశామని తెలిపారు. సరిహద్దుల్లో 2021లో దాదాపు రూ. 88 కోట్ల విలువైన మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.
ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌తో కలిసి గస్తీ: జమ్మూ ఐజీ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించడంతో అప్రమత్తమయ్యామని బీఎస్‌ఎఫ్ జమ్మూ ఐజీ డీకే బోరా చెప్పారు. సరిహద్దు అవతలి నుంచి చొరబాట్లు జరగొచ్చని.. ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేయొచ్చని సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి యాంటీ డ్రోన్ ఎక్సర్సయిజ్‌లు, టన్నెల్స్‌ను గుర్తించడం ముమ్మరం చేశామన్నారు. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌తో కలిసి గస్తీ పెంచామని తెలిపారు. వీలైనంత ఎక్కువ మందిని సరిహద్దులో మోహరించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment