చార్జిషీట్‌లో పేర్కొన్న ఎన్‌ఐఏ
బనశంకరి: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటన వెనుక పాక్ ఉగ్రవాది హస్తం ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు బెంగళూరులోని ఎన్‌ఐఏ కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. పాక్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది పైజల్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నారని తెలిపింది.
కాగా ఈ కేసులో ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్, ముజమ్మిల్ షరీఫ్‌లు నిందితులుగా ఎన్‌ఐఏ గుర్తించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 42 రోజుల తర్వాత నిందితులను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. మంగళూరు కుక్కర్ పేలుడు తర్వాత ముస్సావిర్ షాజిబ్, తాహాలు అదృశ్యమయ్యారు. కొన్నేళ్ల అనంతరం మళ్లీ బెంగళూరు చేరుకున్నారు. ఈ సమయంలో ముజమ్మిల్ షరీఫ్‌తో పరిచయమైంది.
ముజమ్మిల్ మెజస్టిక్ వద్ద హోటల్‌లో పనిచేసేవాడు. ఇతనే ముస్సావిర్ షాజిబ్, తాహాలను ఐసిస్ ఉగ్రవాదంలోకి చేర్చాడు. మొదటి దశలో కొన్ని దుశ్చర్యలు చేయడానికి ముజమ్మిల్ టాస్క్ ఇచ్చాడు. 2023 డిసెంబర్‌లో బెంగళూరులోని మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి కుట్రపన్నారు. తర్వాత షాజీబ్ బెంగళూరు నుంచి చెన్నైకు మకాం మార్చాడు. ట్రిప్లికేన్‌లో అద్దె ఇంట్లో ఐఈడీ బాంబు తయారుచేసి 2024 జనవరి 22 ఉదయం బెంగళూరుకు చేరుకున్నాడు.
మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి షాజీబ్ ప్లాన్ రూపొందించాడు. పోలీసు భద్రత ఎక్కువగా ఉండటంతో బీజేపీ కార్యాలయం వెనుక బాంబు పెట్టి 90 నిమిషాలకు టైమర్ సెట్ చేశారు. అయితే బాంబు పేలలేదు. అనంతరం షాజీబ్ చెన్నై పారిపోయాడు. అనంతరం బెంగళూరులో జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతంలో బాంబు పెట్టడానికి ప్లాన్ చేశారు. ఫిబ్రవరి నెలలో ఐఈడీ బాంబు తయారుచేసి అదేనెల 29 తేదీన షాజీబ్ చెన్నై నుంచి బెంగళూరు చేరుకున్నాడు. కృష్ణరాజపురం టిన్ ఫ్యాక్టరీ వద్ద దిగి అక్కడ నుంచి కుందలహళ్లికి వెళ్లి మార్చి 1న రామేశ్వరం కెఫేలో బాంబు పెట్టినట్లు ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment