► కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలంటూ ఏపీభవన్‌లో నిర్వహించిన ధర్నాకు టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్.. వైఎస్సార్ సీపీ ఎంపీ చింతా అనురాధ మద్దతు పలికారు.
► రాజ్యసభ : దేశ రాజధాని వాయునాణ్యత కమిషన్ బిల్లుకు వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తి, సేవా మౌలిక సదుపాయాల రంగాల నుంచే..అధికంగా కాలుష్యం ఉత్పన్నమవుతోందని చర్చలో వైఎస్సార్ సీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఢిల్లీకి 150 కి.మీ పరిధిలో కాలుష్యం అధికంగా ఉందని, కాలుష్య నియంత్రణ పర్యవేక్షణకు అనేక యంత్రాంగాలు ఉన్నాయని, ఇవన్నీ సమర్థవంతంగా పనిచేయాలంటే ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆయన తెలిపారు.
► పురుషుల హాకీ జట్టుకు పార్లమెంట్ అభినందనలు తెలిపింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మన్‌ప్రీత్ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. 41 ఏళ్ల కలను నిజం చేశారని కొనియాడారు. అదే విధంగా బాక్సర్ లవ్లీనాకు కూడా ఉభయ సభల సభ్యులు అభినందనలు తెలిపారు.
►పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశం పెట్టింది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పీకర్‌కు నోటీసు అందజేశారు. లోక్‌సభలో ఎంపీ డాక్టర్ సత్యవతి స్పీకర్‌కు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ 13వ రోజైన గురువారం కొలువుదీరాయి. అయితే, పెగాసస్ వివాదం పార్లమెంట్‌ను అట్టుడికిస్తోంది. ఈ వ్యవహారంపై జరుగుతున్న రభస కారణంగా ఉభయ సభలు (రాజ్యసభ, లోక్‌సభ) పదేపదే వాయిదా పడుతూనే ఉన్నాయి. పెగాసస్ వివాదంపై, రైతుల చట్టాలపై ప్రభుత్వం చర్చలు జరపాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబడుతున్నాయి.
చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షాల నిరసనలు, వాగ్వాదాలతో పార్లమెంట్ స్తంభింస్తోంది. ఇక ప్రతిపక్షాల రాద్దాంతాన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. పెగాసస్ నిఘాపై చర్చకు అంగీకరించేది లేదని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తున్న పెగాసస్ గూఢచర్య వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ స్పైవేర్ వ్యవహారంపై దాఖలైన తొమ్మిది వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడి ధర్మాసనం విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment