
భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ దరఖాస్తు ఉపసంహరణ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ తాను చేసిన దరఖాస్తును వెనక్కి తీసుకుంది. మన దేశంలో వ్యాక్సిన్ వినియోగానికి తొలిసారిగా దరఖాస్తు చేసుకున్న కంపెనీ ఫైజరే. ఈ నెల 3న భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఏ)తో చర్చించిన అనంతరం దరఖాస్తుని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఫైజర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘డీసీజీఏతో సమావేశం తర్వాత వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి చేసుకున్న దరఖాస్తుని ప్రస్తుతానికి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. డీసీజీఏ కోరిన అదనపు సమాచారాన్ని అందించిన తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకుంటాం’ అని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది.
చదవండి: రాష్ట్రానికి కోవిడ్ సాయం రూ.353 కోట్లు
భారత్‌లో ఎలాంటి ప్రయోగాలు నిర్వహించకుండా, స్థానిక ప్రజలకు ఈ టీకా ఎంత భద్రమైనదో తెలీకుండా వ్యాక్సిన్ వినియోగానికి అవకాశం ఇవ్వలేమని డీసీజీఏ కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేసినట్టుగా సమాచారం. పశ్చిమాది దేశాలకు, మనకు జన్యుపరంగా ఎన్నో మార్పులున్న నేపథ్యంలో స్థానిక ప్రయోగాలు నిర్వహించకుండా అనుమతులు ఇవ్వలేమని డీసీజీఏ వర్గాలు వెల్లడించడంతో ఫైజర్ కంపెనీ అనుమతుల కోసం చేసిన దరఖాస్తుని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ 95శాతం సురక్షితమైనట్లు తేలిందని అంటోంది. ఈ వ్యాక్సిన్‌ను మైనస్ 70డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచవలసి ఉంచాల్సి ఉండడంతో భారత్‌లో ఆచరణలో ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ సాధ్యం కాదన్న అభిప్రాయాలున్నాయి.