కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు! | Pilibhit farmers afraid of cutting the sugarcane crop | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు!

Published Tue, Nov 28 2023 11:09 AM | Last Updated on Tue, Nov 28 2023 11:21 AM

pilibhit farmers afraid of cutting the sugarcane crop - Sakshi

సాధారణంగా రైతులు చేతికొచ్చిన పంటను వీలైనంత త్వరగా కోసి, కొత్త పంటకు నేలను సిద్ధం చేస్తారు. అయితే దీనికి విరుద్దంగా ఆ ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న చెరకు, వరి పంటలను కోసేందుకు రైతులు వెనుకాడుతున్నారు. 

అది ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా.. అక్కడి రైతులు చేతికందిన చెరకును కోయాలంటే గజగజా వణికిపోతున్నారు. దీని వెనుక కారణం తెలిస్తే ఎవరైనా కూడా భయపడాల్సిందే. యూపీలోని పిలిభిత్ జిల్లా రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తులకు కీలకమైన ప్రాంతంగా గుర్తింపుపొందింది. జిల్లాలోని రైతులు ప్రధానంగా వరి, చెరకు పండిస్తుంటారు. అయితే జిల్లాలో ప్రతి ఏటా పంట కోతకు వచ్చినప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

దీని వెనుక ప్రకృతి వైపరీత్యమేదో కారణమనుకుంటే పప్పులో కాలేసినట్లే. దీనికి వన్యప్రాణులు ప్రధాన కారణమని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పిలిభిత్ జిల్లాలోని టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉన్న అనేక ప్రాంతాలకు పులులు వస్తుంటాయి. ఇవి చెరకు, వరి పొలాలలో దాక్కుంటాయి. అటువంటి పరిస్థితిలో పంటల కోత సమయంలో కూలీలు వన్యప్రాణుల బారిన పడుతున్నారు. తాజాగా మాథొటాండా పరిధిలోని పిపరియా సంతోష్‌ గ్రామ రైతులు.. మిల్లు నుంచి స్లిప్‌ తీసుకున్నా చెరుకు పంటను కోసేందుకు వెనుకాడుతున్నారు. పలువురు రైతులు రెట్టింపు వేతనాలు ఇస్తామంటున్నా కూలీలు ఈ పొలాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. 

అక్టోబర్ 19 నుండి ఈ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పంట కోస్తున్న సమయంలో కూలీలపై పులులు దాడి చేస్తున్నాయి. ఇటువంటి భయానక పరిస్థితుల్లో కోతకు సిద్ధంగా ఉన్న చెరకు, వరి  పంటలు అలానే ఉండిపోతున్నాయి. కాగా పిలిభిత్ సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్‌ఓ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. వారి అనుమతి లభించాక రెస్క్యూ ఆపరేషన్ చేపడతామన్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యలో లక్షల్లో తులసి మాలల విక్రయాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement