సంక్షోభాన్ని అధిగమిస్తాం  | PM Modi address in Lok Sabha on the current situation in the Middle East | Sakshi
Sakshi News home page

సంక్షోభాన్ని అధిగమిస్తాం 

Mar 23 2026 2:30 PM | Updated on Mar 24 2026 4:23 AM

PM Modi address in Lok Sabha on the current situation in the Middle East

పశ్చిమాసియా కల్లోలంపై మోదీ 

మనపై దీర్ఘకాలం పాటు ప్రభావం 

కరోనా తరహాలో ఎదుర్కొందాం 

ప్రజలకు పిలుపునిచి్చన ప్రధాని

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం తాలూకు ప్రతికూల ప్రభావాలు భారత్‌తో పాటు అన్ని దేశాలపైనా దీర్ఘకాలం పాటు కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభం తరహాలోనే వాటిని కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నివిధాలా సిద్ధంగా, సమైక్యంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘సవాళ్లనే సవాలు చేయగల సత్తా భారతీయుల సొంతమని ఎన్నోసార్లు రుజువు చేశాం. అదే మన గుర్తింపు. అదే మన బలం. 

ఇప్పుడు కూడా ఓపిక, సంయమనం, జాగరూకతతో వ్యవహరిద్దాం’’అంటూ పిలుపునిచ్చారు. పశ్చిమాసియా యుద్ధం, తద్వారా తలెత్తిన పరిస్థితులపై ప్రధాని సోమవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. యుద్ధం కారణంగా చమురు, వంట గ్యాస్, ఎరువులు మొదలుకుని జాతీయ భద్రత దాకా తలెత్తిన ఆందోళనలను సవివరంగా ప్రస్తావించారు. వాటితో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు వివరించారు. హార్మూజ్‌ జలసంధి వద్ద చిక్కుబడ్డ భారత్‌కు చెందిన పలు ఇంధన నౌకలను సురక్షితంగా రప్పిస్తున్నట్టు చెప్పారు. పశ్చిమాసియా కల్లోలానికి చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుందన్న భారత్‌ వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ఈ సంక్షోభంపై పార్లమెంటు వేదికగా ఉమ్మడి గళం విని్పంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 

హార్మూజ్‌ మూత అంగీకారం కాదు 
ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఇంధనమే వెన్నెముక అని ప్రధాని గుర్తు చేశారు. ‘‘ప్రపంచ ఇంధన అవసరాలు తీర్చేందుకు పశ్చిమాసియా ప్రధాన వనరు. అక్కడ మూడు వారాలకు పైగా కొనసాగుతున్న సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది’’అంటూ ఆందోళన వెలిబుచ్చారు. 20 శాతానికి పైగా అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రమైన హార్మూ జ్‌ వంటి జల రవాణా వనరుల మూసివేత, నౌకల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలు ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. 

తమ ప్రభుత్వం పదేళ్లకు పైగా అనుసరిస్తూ వచి్చన ఇంధన వైవిధ్య వ్యూహం ఈ సంక్షోభ సమయంలో ఎంతగానో ఆదుకుంటోందన్నారు. ‘‘ఇంధనం దిగు మతి చేసుకునే దేశాల సంఖ్యను గత 11 ఏళ్లలో 27 నుంచి 41కి పెంచుకున్నాం. తద్వారా ఏదో ఒక్క దేశంపైనే మితిమీరి ఆధారపడే అగత్యం లేకుండా జాగ్రత్త పడ్డాం. ఫలితంగా భారత్‌ వద్ద ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలున్నాయి. వాటిని మరో 65 లక్షల టన్నులకు పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. యుద్ధ సమస్యల పరిష్కారానికి సమగ్రమైన స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలను కేంద్రం రూపొందించింది. రోజువారీ ప్రాతిపదికన పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రుల గ్రూపును ఏర్పాటు చేశాం’’అని మోదీ వివరించారు.

మనోళ్ల భద్రతకు చర్యలు 
గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయు భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు మోదీ తెలిపారు. ‘‘యుద్ధం మొదలైన నాటినుంచీ 3.75 లక్షల మందికి పైగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చాం. ఇరాన్‌ నుంచి 700 మంది వైద్య విద్యార్థులతో పాటు 1,000 మందికి పైగా తిరిగొచ్చారు’’అని వెల్లడించారు.

అక్రమ నిల్వలపై ఉక్కుపాదం 
కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయతి్నంచే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. సరిహద్దు, తీర, సైబర్‌ భద్రతా దళాలను ఇప్పటికే పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసినట్టు వెల్లడించారు. నిత్యావసరాలు, ముఖ్యంగా ఎల్పీజీ తదితరాలను అక్రమంగా నిల్వ చేసే, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతున్నట్టు వివరించారు. 
 
కోవిడ్‌ లాంటి సంక్షోభం : మోదీ ప్రధాని ప్రసంగంలో మరికొన్ని కీలక అంశాలు

  • ప్రపంచ సంక్షోభాల భారం రైతులపై పడకుండా, ఎరువుల కోసం ఏర్పాట్లు.

  • కీలకమైన ముడిసరుకుల విషయంలో నిల్వలను పెంచుకుంది.

  • యుద్ధం, భారతదేశంలో వేసవి ఉష్ణోగ్రతల కారణంగా దేశంలో విద్యుత్ అవసరం పెరుగుతుంది 

  • ప్రస్తుతం, దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయి. 

  • వరుసగా రెండో ఏడాది కూడా  ఒక  బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. 

  • విద్యుత్ ఉత్పత్తి నుంచి సరఫరా వరకు అన్ని వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.

  • మన పునరుత్పాదక బొగ్గు శక్తి 140 గిగావాట్లుగా ఉంది.

  •  గోవర్ధన్ యోజన కింద 40 లక్షలకు పైగా ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు

  • ఈ యుద్ధ ప్రభావం దీర్ఘకాలికంగాఉంటుందని మోదీ హెచ్చరిక

  • కోవిడ్  లాంటి సంక్షోభం, దీన్నిఅధిగమించడానికి  దేశం మరోసారి ఏకం కావాలి

  • గతంలో కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాం.  ఎప్పటిలాగానే ఐక్యంగా ఉండాలి.
     

కాగా అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరా, ఇంధన భద్రతను నిర్ధారించడానికి తీసుకోవాల్సిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యలపై చర్చించేందుకు ప్రధాని మోదీ క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (CCS) సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత  మోదీ ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement