న్యూఢిల్లీ: మహిళల కనీస వివాహ వయస్సు నిర్ధారణ అంశంలో కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ అంశాన్ని పునః పరిశీలించేందుకు ఓ ప్రత్యేక కమిటీ నియమించినట్లు పేర్కొన్నారు. కనీస వివాహ వయస్సు పెంపుపై అధ్యయనంతో పాటు.. కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తోందని వెల్లడించారు. (ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ)
నేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మహిళా సాధికారికతకై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావించారు. మహిళల ఆరోగ్యం, అభ్యున్నతికై పాటుపడుతున్నట్లు తెలిపారు. ‘‘దాదాపు 5 వేలకు పైగా జన్ ఔషధి కేంద్రాల ద్వారా పేద మహిళలకు 5 కోట్లకు పైగా శానిటరీ ప్యాడ్లను కేవలం ఒక రూపాయికే అందించాం. మహిళా సాధికారికతకు పెద్దపీట వేశాం. ట్రిపుల్ తలాక్ వంటి చట్టాలు తీసుకువచ్చాం. నావికా దళం, వాయుసేనలో సముచిత స్థానం కల్పించాం. అదే విధంగా మన కూతుళ్ల కనీస వివాహ వయస్సు నిర్ధారణ గురించి అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించాం. ఇందుకు సంబంధించిన నివేదిక అందగానే నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.(‘భరత మాత’ విముక్తికై పోరాడిన ధీర వనితలు)
Comments
Please login to add a commentAdd a comment