న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలి. కరోనా వేరియంట్లపై జాగ్రత్తగా ఉండాలి. కొత్త వేరియంట్లపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. కరోనా నిబంధనలను పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి.’’ అని అన్నారు.
అంతేకాకుండా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. వ్యాక్సిన్ పై ప్రజల్లో అపోహలు తొలగించాలని ఆయన అన్నారు. 23 వేల కోట్ల రూపాయలతో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇక ఈ సమావేశంలో అసోం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రి అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈనెల 16న ప్రధాని మోదీ మరో వీడియో కాన్ఫరెన్స్
ఈనెల 16న ఉదయం 11 గంటలకు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో భాగంగా కోవిడ్-19 పరిస్థితులు, వ్యాక్సినేషన్ అంశాలపై ప్రధాని మోదీ సీఎంలతో సమీక్షించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment