ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌! | PM Modi Website Account Hacked Twitter Says Actively Investigating | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌!

Published Thu, Sep 3 2020 9:26 AM | Last Updated on Thu, Sep 3 2020 4:52 PM

PM Modi Website Account Hacked Twitter Says Actively Investigating - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని ట్విటర్‌ ప్రతినిధులు ధ్రువీకరించారు. భారత ప్రధాన మంత్రి మోదీ వ్యక్తిగత ట్విటర్‌ అకౌంట్‌ గురువారం వేకువ జామున హ్యాక్‌ అయిందని, ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఖాతాను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు చేపట్టిన్లు వెల్లడించారు. ఇతర ఖాతాలపై ఇలాంటి ప్రభావం ఉంటుందని భావించడం లేదని చెప్పుకొచ్చారు. కాగా కోవిడ్‌-19 నేపథ్యంలో పీఎం నేషనల్‌ ఫండ్‌ ద్వారా క్రిప్టోకరెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వాలని ఆయన కోరినట్లుగా నేరగాళ్లు వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఈ ఖాతాను జాన్‌ విక్‌ (hckindia@tutanota.com) హ్యాక్‌ చేసింది. మేం పేటీఎం మాల్‌ను హ్యాక్‌ చేయలేదు’’ అని పేర్కొన్నారు.

కాగా ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కు అనుసంధానంగా ఉన్న narendramodi_in హ్యాండిల్‌కు 2.5 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. ఈ అకౌంట్‌ నుంచి మోదీ ఇప్పటి వరకు సుమారుగా 37 వేల ట్వీట్లు చేశారు. చివరిసారిగా ఆగష్టు 31న మన్‌ కీ బాత్‌ గురించి ఇందులో ప్రస్తావించారు. ఇక ట్విటర్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలైలో ఎంతో మంది ప్రముఖుల ఖాతాలు హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. (చదవండి: అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్‌ )

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రస్తుతం డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బిడెన్‌, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, ప్రముఖ బిలియనీర్‌ వారెన్‌ బఫెట్‌ తదితరుల ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. వీరితో పాటు అనేక వ్యాపార సంస్థల పేరిట ట్వీట్లు పెట్టిన హ్యాకర్లు.. డిజిటల్‌ కరెన్సీ(బిట్‌కాయిన్)‌ స్కామ్‌కు విఫలయత్నం చేశారు. కాగా గతేడాది ఆగష్టులో ట్విటర్‌  సీఈవో,  సహ  వ్యవస్థపాకుడు జాక్ డోర్సీ ఖాతాను హ్యాక్ చేసిన నేరగాళ్లు వివాదాస్పద ట్వీట్లతో బెంబేలెత్తించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement