జగమంతా రామమయం | PM Narendra Modi attends Bhoomi Puja ceremony in Ayodhya | Sakshi
Sakshi News home page

జగమంతా రామమయం

Published Thu, Aug 6 2020 3:02 AM | Last Updated on Thu, Aug 6 2020 7:28 AM

PM Narendra Modi attends Bhoomi Puja ceremony in Ayodhya - Sakshi

అయోధ్యలో రామ్‌ లల్లా ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్న మోదీ, అయోధ్యలో భూమిపూజ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

అయోధ్య:  శతాబ్దాల నిరీక్షణ ఫలించింది. కోట్లాది రామభక్తుల స్వప్నం సాకారమైంది. దేశవ్యాప్తంగా రామ నామం ప్రతిధ్వనించింది. విశ్వవ్యాప్తంగా హిందూ లోగిళ్లలో ఉత్సవ వాతావరణం నెలకొంది. బాల రాముడి కోసం ఆయన జన్మస్థలిలోనే నవ్య, భవ్య, రమ్య మందిరం ఘనంగా సిద్ధమవుతోంది. అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడని భక్తులు విశ్వసించే ప్రదేశంలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.

సుముహూర్త సమయమైన మధ్యాహ్నం 12.44 గంటలకు శంకుస్థాపన జరిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనంది బెన్‌ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ చీఫ్‌ సంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది. పట్టణమంతా పూల దండలతో ముస్తాబయింది. అలాగే, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.

పలు చోట్ల ప్రజలు షాపుల్లోని టీవీల ముందు నిల్చుని కార్యక్రమాన్ని చూశారు. దేశంలోని పలు రామాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. భూమి పూజ అనంతరం ప్రధాని మోదీ ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘సియా(సీతా)వర్‌ రామచంద్రజీ కీ జై’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. భారత దేశ ఆత్మగా నిలిచిన సకలగుణాభిరాముడి ఔన్నత్యాన్ని ఘనంగా శ్లాఘించారు. రామ నామం ఇప్పుడు దేశం నలుమూలలా ప్రతిధ్వనిస్తోందన్నారు. రాముడు  సర్వ జనుల కొంగు బంగారమని కొనియాడారు.

అద్భుత ఆలయంగా శతాబ్దాలు నిలిచే నిర్మాణానికి భూమిపూజ నిర్వహించే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. దశాబ్దాలుగా చిన్న తాత్కాలిక గుడారంలో ఉన్న రామ్‌లల్లా ఇకపై అద్భుతమైన ఆలయంలో కొలువుతీరుతారని హర్షం వ్యక్తం చేశారు. రామ్‌లల్లా ఆలయం భారతదేశ ఘన సంస్కృతికి ప్రతీకగా, మానవాళికి స్ఫూర్తిప్రదాయినిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయులందరి హృదయాల్లో రాముడు నిలిచి ఉంటాడన్నారు. సామాజిక సామరస్యం రామరాజ్యంలో ముఖ్యమైన విధానమని తెలిపారు. రాళ్లపై శ్రీ రామ అని రాసి ‘రామసేతు’ నిర్మించిన తీరుగానే.. దేశంలోని మూల మూలల నుంచి రామ మందిర నిర్మాణం కోసం ఇటుకలు వచ్చాయని మోదీ వ్యాఖ్యానించారు. ప్రసంగం ముగించే ముందు సీతారాములను కీర్తిస్తూ ‘జై శ్రీరామ్‌’ అని నినదించారు.   

హనుమాన్‌గఢీలో హారతి
భూమి పూజ కోసం బుధవారం ఉదయం ప్రధాని మోదీ అయోధ్య చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి, ముందుగా హనుమాన్‌గఢీలోని ఆంజనేయుడి దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ స్వయంగా పవన సుతుడికి హారతి ఇచ్చారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ తరువాత అక్కడినుంచి వారు నేరుగా రామ్‌లల్లాను దర్శించుకునేందుకు రామజన్మభూమికి వెళ్లారు. రామ్‌లల్లాకు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. అనంతరం, కొద్దిమంది ఆహ్వానితుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భూమిపూజ వేదికకు సాష్టాంగ ప్రణామాలు అర్పించారు.

అనంతరం విశిష్ట అతిథుల సమక్షంలో కాసేపు ప్రసంగించారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 175 మందికి మాత్రమే ఆహ్వానం పంపించారు. వారిలో పలువురు వృద్ధాప్యం సహా పలు ఇతర కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య దశాబ్దాలుగా సాగిన వివాదం అనంతరం.. రామజన్మభూమి ప్రాంతం రామ్‌లల్లాకే చెందుతుందని స్పష్టం చేస్తూ గత సంవత్సరం సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ప్రకటించిన నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. 1992లో ఆ ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేయడం, తదనంతరం దేశవ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగడం తెలిసిందే.

రామ చరితం విశ్వవ్యాప్తం
ప్రసంగం ప్రారంభ, ముగింపు సమయాల్లో సీతారాములను కీర్తిస్తూ ‘సియావర్‌ రామచంద్ర కీ జై’, ‘సీతారామ్‌’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినదించారు. ‘ఈ నినాదాలు ఇక్కడే కాదు.. ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తున్నాయి’ అని అన్నారు. ‘అంతా జానకీ మాతను, శ్రీరామ చంద్రుడిని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆ తరువాత నేను ప్రసంగం ప్రారంభిస్తాను’ అన్నారు. అనంతరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, రామ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రసంగాన్ని ముగిస్తూ.. ‘ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆ రామచంద్రుడిని, సీతమ్మ తల్లిని ప్రార్థిస్తున్నా. వారిద్దరి ఆశీస్సులు మీ పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు.

తొలి ప్రధాని మోదీనే..
అయోధ్యలో రామ జన్మభూమిని, హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను మోదీ
ఆవిష్కరించారు.    

దేశంలో నెలకొని ఉన్న సామాజిక సామరస్యానికి, దేశ ప్రజల అభినివేశానికి ఈ కార్యక్రమం సాక్ష్యంగా నిలుస్తుంది. రామరాజ్య విలువలతో నడిచే ఆధునిక భారతదేశ ప్రతీకగా చట్టబద్ధంగా నిర్మితమవుతున్న ఈ ఆలయం
నిలుస్తుంది.
    –రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

భారతీయుల 500 ఏళ్ల కలను నేడు ప్రధాని మోదీ సాకారం చేశారు. ప్రధాని మోదీ ముందుచూపు, జ్ఞానము రామ మందిరానికి మార్గం సుగమం చేశాయి. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా, రాజ్యాంగ మార్గాల ద్వారా సమస్యలు ఎలా పరిష్కరించవచ్చో మోదీ చూపించారు.     
    –యోగి ఆదిత్యనాథ్, ఉత్తర ప్రదేశ్‌ సీఎం

మానవ విలువలకు అత్యున్నత రూపం రాముడు. ఆయన శాంతమూర్తి. ఆయనలో క్రూరత్వం, ద్వేషం, అన్యాయం లేవు.
    –రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత

రామ మందిర నిర్మాణానికి పునాది పడిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఆనందాన్ని నింపింది. దేశం స్వతంత్రంగా నిలబడగల ఆత్మవిశ్వాసం దీని ద్వారా వస్తుంది. రామాలయం కోసం రథయాత్ర చేసిన అడ్వాణీ జీ కార్యక్రమంలో హాజరు కాలేకపోయినా, టీవీ ద్వారా చూస్తూ ఉంటారు.    
    – మోహన్‌ భాగవత్, ఆరెస్సెస్‌ చీఫ్‌

కోట్లాది మంది హిందు వుల కల నేడు నిజమైంది. అయోధ్యలో రామాలయ నిర్మా ణం ప్రజా క్షేమం కోసం చేస్తున్న కార్యక్రమం. ఇది దేశాన్ని, ప్రపంచాన్ని నిర్మించడం లాంటిది.  ఆలయాన్ని త్వరగా నిర్మి స్తే మన కళ్లతో చూడవచ్చు. ఓ వైపు మోదీ, మరో వైపు యోగి. ఇప్పు డు కాకపోతే ఎప్పుడు నిర్మిస్తారు.
–మహంత్‌ న్రిత్య గోపాల్‌ దాస్, రామాలయ ట్రస్ట్‌ చీఫ్‌

స్వాతంత్య్ర పోరాటం తీరుగానే..
బంగారు రంగు కుర్తా, ధోవతిపై కాషాయ కండువా ధరించి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణం దేశ ఐక్యతకు ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆలయంతో ఈ ప్రాంతం ఆర్థి కంగా పుంజుకుంటుందన్నారు. ప్రేమ, సౌభ్రాతృత్వం పునాదులుగా ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. ‘దశాబ్దాలుగా చిన్న గుడారంలో ఉన్న రామ్‌లల్లా కోసం అద్భుత ఆలయం రూపుదిద్దుకోనుంది. తన అస్తిత్వాన్ని రూపుమాపేందుకు శతాబ్దాలుగా సాగిన అన్ని ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకుని రామ జన్మభూమి స్వేచ్ఛను పొందింది.

రాముడి విగ్రహాలను ధ్వంసం చేశారు. కానీ ఆయన మన హృదయాల్లో నిలిచి ఉన్నాడు. మన సంస్కృతికి మూలం ఆయనే’ అన్నారు. ఇప్పుడు భారత్‌ అయోధ్యలో ఒక అద్భుత అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు. భారత దేశ విశిష్టత  భిన్నత్వంలో ఏకత్వమని, ఆ భావనను నిలిపే ఉమ్మడి బంధం రాముడేనని వ్యాఖ్యానించారు. ఆంగ్లేయుల నుంచి స్వాతంత్య్రం పొందేందుకు జరిపిన పోరాటంతో.. ఆయోధ్యలోని రామజన్మభూమి ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించేందుకు శతాబ్దాలు సాగిన పోరాటాన్ని ప్రధాని పోల్చారు.

స్వాతంత్య్ర పోరాటంలో దళితులు, గిరిజనులు సహా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మహాత్మాగాంధీకి మద్దతిచ్చిన విధంగానే.. నేడు ప్రజలంతా దేశంలోని మూలమూలల నుంచి ఇటకలు, మట్టి, పవిత్ర జలంతో రామాలయ నిర్మాణానికి సహకరిస్తున్నారన్నారు. వేలాది మంది సహకారం, కృషి కారణంగానే రామాలయ నిర్మాణానికి పునాది పడిందన్నారు.

తమ జీవిత కాలంలో ఈ అద్భుతాన్ని చూస్తామని ఊహించని వారంతా.. ఇప్పుడు తాదాత్మ్యంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించనున్న ఆలయం భారతదేశ సంస్కృతి, విశ్వాసాలకు, జాతీయ భావనకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ తెలిపారు. రాముడు చూపిన మార్గంలో వెళ్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ మార్గం తప్పినప్పుడు విధ్వంసం చోటు చేసుకుంటుందని వివరించారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా సహా.. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు రూపాల్లో రామ చరితం ప్రజల్లో నిలిచి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


 జైపూర్‌లోని రామచంద్రజీ ఆలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న భక్తురాలు


మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో రామ్‌టెంపుల్‌ కరమ్‌చంద్‌ చౌక్‌ వద్ద బాణసంచా కాలుస్తూ స్థానికుల సంబరాలు


 అయోధ్యలో హనుమాన్‌ ఆలయంలో హారతి ఇస్తున్న ప్రధాని మోదీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement