న్యూఢిల్లీ/గాంధీనగర్: సమాన, సమ్మిళిత అభివృద్ధిని సాధించే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రగతి విషయంలో భారత్ నూతన శకంలోకి ప్రవేశిస్తోందంటూ వెలువడిన పలు నివేదికలను ఆయన ప్రస్తావించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందంటూ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.
ఈ మేరకు మోదీ శుక్రవారం లింక్డ్‌ఇన్‌లో పోస్టు చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఎస్‌బీఐ రీసెర్చ్, జర్నలిస్టు అనిల్ పద్మనాభన్ విడుదల చేసిన నివేదికల గురించి ప్రస్తావించారు. గత తొమ్మిదేళ్లలో ప్రజల ఆదాయం భారీగా పెరిగినట్లు ఈ నివేదికలు చెబుతున్నాయని వెల్లడించారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లు(ఐటీఆర్) దాఖలు చేసేవారి సంఖ్య పెరుగుతోందని గుర్తుచేశారు.
ఉత్తరప్రదేశ్‌లో 2014 జూన్‌లో 1.65 లక్షల ఐటీఆర్‌లు దాఖలు కాగా, 2023 జూన్‌లో 11.92 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని వివరించారు. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ లాంటి చిన్నరాష్ట్రాల్లోనూ ఐటీఆర్‌ల సంఖ్య తొమ్మిదేళ్లలో 20 శాతం పెరిగిందన్నారు. దేశ ఉమ్మడి ప్రయత్నాలనే కాదు, దేశ శక్తిసామర్థ్యాలను సైతం ఈ నివేదికలు బహిర్గతం చేస్తున్నాయని ప్రధానమంత్రి వివరించారు. ‘2047 నాటికి వికాస్ భారత్’ అనే లక్ష్యాన్ని మనం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మరో హెల్త్ ఎమర్జెన్సీకి సిద్ధం కావాలి
ప్రజల సంక్షేమం కోసం నవీన ఆవిష్కరణలను, సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ సూచించారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాం«దీనగర్‌లో జరిగిన జీ20 దేశాల ఆరోగ్య శాఖ మంత్రుల సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాలని చెప్పారు.
గడువు కంటే ముందే భారత్‌లో ప్రజల భాగస్వామ్యంతో క్షయవ్యాధిని(టీబీ) పూర్తిగా అరికట్టబోతున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలు ఒక ఉమ్మడి వేదికపై రావాలని ఆకాంక్షించారు. డిజిటల్ విధానాలు, నూతన ఆవిష్కరణలతో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు. కోవిడ్ మహమ్మారి నుంచి పాఠాలు నేర్చుకోవాలని, అలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రజా ఉద్యమంగా అభివృద్ధి కార్యక్రమాలు
న్యూఢిల్లీ: దేశంలో అభివృద్ధి కార్యక్రమాలను ఒక ప్రజా ఉద్యమంగా నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీకి చెందిన జిల్లా పంచాయతీ సభ్యులకు పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్‌ను సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, ఇందుకోసం ప్రతి గ్రామంలో, ప్రతి తహసీల్ పరిధిలో, ప్రతి జిల్లాలో అభివృద్ధి దీపం వెలిగించాలని ఉద్బోధించారు. శుక్రవారం గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల బీజేపీ స్థానిక సంస్థల సభ్యులు పాల్గొన్న ‘క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషత్’ శిక్షణా కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అనేది కేవలం ఒక నినాదం కాదని, ప్రతిక్షణం ప్రగతి కోసం, ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.
ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. స్థానిక సంస్థల్లో వేర్వేరు హోదాల్లో ఉన్నవారు గ్రామాలు, జిల్లాల్లో పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలని అన్నారు. ప్రజల మద్దతుతో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని వివరించారు. స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు పెరుగుతోందని, వనరుల కొరత లేదని వెల్లడించారు. గ్రాంట్ కింద గతంలో రూ.70,000 కోట్ల కేటాయింపులు జరిగేవని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకుపైగానే ఇస్తున్నారని తెలిపారు. దేశంలో తమ ప్రభుత్వం వచ్చాక 30,000కుపైగా జిల్లా పంచాయతీ భవనాలు నిర్మించామని గుర్తుచేశారు. ఉపాధి హామీ నిధులతో పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించాలని కోరారు.
‘పీఎం విశ్వకర్మ’ను విజయవంతం చేయాలి
బీజేపీ స్థానిక సంస్థల సభ్యులకు శిక్షణ ఇవ్వడానికి మరిన్ని వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఇవి ఎన్నికల్లో గెలవడానికి కాదని, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవడానికేనని స్పష్టం చేశారు. ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో సంప్రదాయ వృత్తిదారులను గుర్తించాలని, అర్హులతో జాబితాలు తయారు చేయాలని అన్నారు. సంప్రదాయ వృత్తిదారులు గ్రామాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వారు తమ పనులను సామాజిక బాధ్యతగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. సంప్రదాయ వృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయిస్తున్నామని తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని సెపె్టంబర్ 17న ప్రారంభిస్తామని మోదీ పునరుద్ఘాటించారు.
‘2047 నాటికి వికాస్ భారత్’ తథ్యం
Published Sat, Aug 19 2023 5:50 AM | Last Updated on Sat, Aug 19 2023 7:31 AM
Comments
Please login to add a commentAdd a comment