నవ భారత నిర్మాణానికి నడుం బిగించండి | PM Narendra Modi Message To IIT Kanpur | Sakshi
Sakshi News home page

నవ భారత నిర్మాణానికి నడుం బిగించండి

Published Wed, Dec 29 2021 4:29 AM | Last Updated on Wed, Dec 29 2021 8:48 AM

PM Narendra Modi Message To IIT Kanpur - Sakshi

కాన్పూర్‌ మెట్రోలో ప్రయాణిస్తూ స్థానికులకు ప్రధాని మోదీ అభివాదం

కాన్పూర్‌: యువత తాము కలలుకనే భారతం కోసం ఇప్పటినుంచి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ కాన్పూర్‌ 54వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. యువత సుఖాల కన్నా సవాళ్లను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే ఎంతో సమయం వృధా అయిందని, విద్యార్థిలోకం తక్షణం నడుం బిగించి పనిచేస్తే వచ్చే 25ఏళ్లలో వాళ్లు కలలు గనే భారత్‌ను చూడవచ్చని ఉద్భోదించారు.

భారత స్వావలంబనకు తోడ్పడాలని నూతన గ్రాడ్యుయేట్లను ఆయన కోరారు. స్వాతంత్య్రానంతరం భారత్‌ నూతన పయనం ఆరంభమైందని, నిజానికి 25ఏళ్లు పూర్తయ్యేసరికి ఎంతో అభివృద్ధి జరిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ సమయం వృథా చేయడం వల్ల దాదాపు రెండు తరాలు గడిచిపోయాయన్నారు. అందుకే ఇకపై ఎంతమాత్రం జాప్యం కూడదని హెచ్చరించారు.  

అనంతరం కాన్పూర్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని ప్రధాని ప్రారంభించారు. ఐఐటీ కాన్పూర్‌ నుంచి మోదీ ఝీల్‌ వరకు 9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం పూర్తయింది. దీంతోపాటు 356 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ ప్రాజెక్టును  ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రధాని మోదీ కాన్పూర్‌ నుంచి లక్నోకు 80 కిలోమీటర్లు రోడ్డుమార్గం ద్వారా వెళ్లాల్సి వచ్చింది. దారిపొడవునా తనిఖీలు చేసి, తగిన బందోబస్తును ఏర్పాటు చేశాక మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణించారు.

ఐదేళ్లు దోచుకోవచ్చనుకున్నారు
సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తన కాన్పూర్‌ పర్యటనలో నిప్పులు చెరిగారు. గతంలో యూపీలో అధికారంలోకి వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ, ఎదురులేకుండా ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకునే లాటరీ దొరికినట్లు భావించిందని దుయ్యబట్టారు. అనంతరం ఏర్పడిన తమ ప్రభుత్వం నిజాయితీ, పారదర్శకతతో పనిచేస్తోందన్నారు.

ఇటీవల కాన్పూర్‌కు చెందిన సుగంధద్రవ్యాల వ్యాపారి వద్ద కోట్ల రూపాయల నగదు దొరకడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది ప్రతిపక్షం సాధించిన విజయమని ఎద్దేవా చేశారు. 2017కు పూర్వం అవినీతి దుర్గంధం రాష్ట్రమంతా వ్యాపించిందని, కట్టలు బయటపడగానే ఎస్‌పీ నేతల నోళ్లు మూతపడ్డాయని విమర్శించారు. కాన్పూర్, యూపీ ప్రజలకు మొత్తం అర్థమవుతోందన్నారు. యూపీలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతోందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement