హిమాచల్ ప్రదేశ్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మురిసిపోతున్నారు. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వారికి పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మంగళవారం (జనవరి 30) హిమపాతం కారణంగా 300 మందికి పైగా పర్యాటకులు రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్నారు. అయితే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
హిమాచల్‌తో పాటు దేశంలోని ఎగువ ప్రాంతాలైన కులు మనాలిలో కూడా విపరీతంగా మంచు కురుస్తోంది. ఫలితంగా చలి మరింతగా పెరిగింది. పర్యాటకులు హిమపాతాన్ని చూసి, మురిసిపోతూ, దానిలో ఆడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో హిమపాతం కారణంగా పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అటల్ టన్నెల్‌లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టిందని సూపరింటెండెంట్ లాహౌల్ స్పితి మయాంక్ చౌదరి తెలిపారు.
రాబోయే కొద్దిరోజులపాటు హిమాచల్‌లో వాతావరణం ఇదే తరహాలో ఉండవచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఇటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వత ప్రదేశాలకు చేరుకుంటున్నారు. సిమ్లాలోని కుఫ్రీ, మనాలిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని రిడ్జ్, మాల్ రోడ్‌లలో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment