కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ వైపు తుపాను బీభత్సం సృష్టించింది. మరో వైపు రాజకీయ తుఫాన్ చెలరేంగింది. తుపాను కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు, సుమారు 500 మంది గాయాలపాలయ్యారు. కొంతమంది ఆవాసాలు కోల్పోయారు, మరి కొందరు ఆసుపత్రి పాలయ్యారు. ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు జల్‌పైగురిలోని ఆసుపత్రికి చేరుకున్నారు.
మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. చాలామంది సర్వస్వం కోల్పోయారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఆవాసాలు కోల్పోయిన వారిలోని కొందరు జనం తాప్సిఖాతా పాఠశాలలోని సహాయ శిబిరంలో ఉన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ.. విపత్తు సంభవిస్తే.. ప్రభుత్వం సహాయక చర్యలు చేయడంలో ముందడుగు వేయొచ్చని ఆమె స్పష్టం చేశారు.
దాదాపు నాలుగు నిమిషాల పాటు సాగిన గాలివానలో వందలాది మంది గాయపడ్డారు. జల్పాయిగురి పట్టణం, మేనాగురిలోని కొన్ని ప్రాంతాలు, అలీపుర్‌దువార్‌లోని కొన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. తుఫాన్ అనేక ఇళ్ళను నేలకూల్చింది. పంటలను నాశనం చేసింది. పెద్ద సంఖ్యలో పశువులు మరణించాయి.
ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నేత సువేందు అధికారి, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా తుపాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రిని సందర్శించడానికి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై స్పందించిన సువేందు అధికారి.. ముఖ్యమంత్రి మాదిరి చార్టర్డ్ ఫ్లైట్‌లు మా దగ్గర లేవు. తృణమూల్ కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా చాలా డబ్బును పొందిందని అన్నారు. మేము సాధారణ వాహనాల కోసం వేచి ఉండాలి అని ఎద్దేవా చేశారు.
సువేందు అధికారి వ్యాఖ్యలపై.. ముఖ్యమంత్రి మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిధుల నిలిపివేత అంశాన్ని కూడా లేవనెత్తారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌కు ఆవాస్ యోజన నిధులను విడుదల చేసి ఉంటే, ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా గాయపడేవారు కాదని అన్నారు.
తుపాను ప్రభావిత జిల్లాలైన జల్‌పైగురి, అలీపుర్‌దువార్, కూచ్‌బెహార్ జిల్లాల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తుపాను కారణంగా జల్పాయిగురి లోక్‌సభ స్థానంతో పాటు కూచ్‌బెహార్‌లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసీవింగ్ సెంటర్ దెబ్బతిన్నాయి. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీటిని మళ్ళీ పునర్నిర్మించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment