న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా రికార్డయ్యింది. అఫ్గానిస్తాన్‌లోని హిందూకుషిలో భూఉపరితలం నుంచి 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలియజేసింది. రాత్రి 10.20 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. హరియాణా, పంజాబ్, రాజస్తాన్, కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలియరాలేదు. భూకంపం వల్ల జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల సేవలకు అంతరాయం కలిగింది. అఫ్గానిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడయ్యింది.
పాక్, అఫ్గాన్‌లో భారీ ప్రకంపనలు
ఇస్లామాబాద్: భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లో మంగళవారం రాత్రి బలమైన భూప్రకంపనలు నమోదయ్యాయి. ఇది రిక్టర్ స్కేల్‌పై 6.8గా రికార్డయ్యింది.
పాకిస్తాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, జీలం, షేక్‌పురా, స్వాత్, ముల్తాన్, షాంగ్లా తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం అందలేదు. పాకిస్తాన్ భూకంప ప్రభావిత దేశమే. దేశంలో 2005లో సంభవించిన భూకంపం వల్ల 74,000 మంది మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment