సాక్షి, న్యూఢిల్లీ: కరోనా చిన్నారులపై ఇప్పటిదాకా పెద్దగా ప్రభావం చూపకపోయినా వైరస్ స్వరూపం మారి, సంక్రమణ స్వభావంలో తేడాలు వస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. అలాంటి పరిస్థితులు వస్తే సమర్థంగా ఎదుర్కొనడానికి తగిన చర్యలు తీసుకున్నామని నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ తెలిపారు. పిల్లల్లో కోవిడ్ చూపుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. పిల్లల్లో వైరస్ ప్రవర్తన, ప్రభావం, క్లినికల్ ప్రోఫైల్, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి ఈ నిపుణుల బృందం... సన్నద్ధతకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసిందని తెలిపారు. ఇప్పటివరకు పిల్లల వైద్య వ్యవస్థపై భారం పడలేదని కాకపోతే రాబోయే రోజుల్లో కరోనా బారినపడ్డ పిల్లల్లో 2 నుంచి 3 శాతం మందిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావొచ్చని అన్నారు. పిల్లల్లో కోవిడ్ చికిత్సకు అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
పిల్లల్లో అసింప్టమాటిక్‌గానే కరోనా
చిన్నపిల్లల్లో కోవిడ్–19 సంక్రమణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమౌతున్న పరిస్థితుల్లో కరోనా బారినపడే పిల్లలకు అవసరమైన సంరక్షణ, మౌలిక సదుపాయాల్లో ఎటువంటి లోపం ఉండదని స్పష్టంచేశారు. పిల్లల్లో కోవిడ్–19 తరచుగా అసింప్టమాటిక్‌గానే ఉంటుందని, చాలా అరుదుగా ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్ పాల్ అన్నారు. పిల్లల్లో కోవిడ్–19 రెండు రూపాల్లో ఉంటుందని తెలిపారు.
►ఇన్ఫెక్షన్, దగ్గు, జ్వరం, న్యుమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
►కరోనా సోకిన 2–6 వారాల దాకా ఇది ఎక్కువగా అసింప్టమాటిక్‌గా ఉంటుంది. కానీ చాలా తక్కువమంది పిల్లల్లో జ్వరం, శరీరంపై దద్దుర్లు, కండ్లకలక, శ్వాస సమస్యలు, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కేవలం ఊపిరితిత్తులను ప్రభావితం చేసే న్యుమోనియాగా పరిమితం కాకపోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపిస్తుంది. దీనిని మల్టీ–సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటారు. ఇది పోస్ట్–కోవిడ్ లక్షణం. ఈ సమయంలో శరీరంలో వైరస్ కనుగొనలేము. కోవిడ్–19 టెస్ట్ సైతం నెగెటివ్‌గా వస్తుంది. కానీ యాంటీబాడీ పరీక్షలో పిల్లలకి కోవిడ్–19 సోకినట్లు తెలుస్తుంది. కొంతమంది పిల్లలలో కనిపించే ఈ ప్రత్యేక వ్యాధి చికిత్సకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని డాక్టర్ వీకే పాల్ తెలిపారు. అయితే ఈ వ్యాధికి చికిత్స కష్టం కానప్పటికీ సకాలంలో అందించాల్సిన అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment