సాక్షి బెంగళూరు: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. థియేటర్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, వాణిజ్య కేంద్రాలకు అనుమతులు జారీ చేశారు. ఇదే క్రమంలో ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బదులుగా.. ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. పలు వర్గాల నుంచి సీఎం బసవరాజ్ బొమ్మైకు పెద్ద సంఖ్యలో వినతి పత్రాలు చేరినట్లు సమాచారం. లాభదాయకంగా ఉందని ఐటీ కంపెనీలవారు ఇంటి పని విధానాన్ని కొనసాగిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఆఖరికి ఐటీ ఉద్యోగులు కూడా ఆఫీసు నుంచి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
రెండేళ్ల నుంచి ఇదే రీతి..
కోవిడ్ వల్ల 2020 మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆరంభమైంది. ఉద్యోగులు ఇళ్ల నుంచి పని చేసుకుంటూ ఉండగా, వారిపై ఆధారపడిన క్యాబ్ డ్రైవర్లు, టీ షాపులు, క్యాంటీన్లు, ఫుడ్ పార్సిల్‌దారులు పని లేక వీధి పాలయ్యారు. థియేటర్లు, మాల్స్‌లో కూడా రద్దీ క్షీణించడానికి ఇదొక కారణం. ఐటీ ఉద్యోగులు వేలాదిగా సొంతూళ్లు వెళ్లిపోవడంతో నగరంలో అనేక రకాల వ్యాపార వాణిజ్యాలు తీవ్ర నష్టాల పాలయ్యాయి. కేవలం 30 శాతం మంది ఐటీ ఉద్యోగులే బెంగళూరులో ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఆర్థికాభివృద్ధికి గండి..
పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఒక్కో దాంట్లో సుమారు 20– 50 వేల మంది ఉద్యోగులు పని చేస్తారు. ప్రతి కంపెనీలో 15 హోటళ్లు/ ఫుడ్ కోర్టులు ఉంటాయి. వర్క్ ఫ్రం హోంతో అవన్నీ మూతపడగా వేలాది మందికి ఉపాధి కరువైంది. లాక్‌డౌన్‌కు ముందు ఐటీ రంగంలో రోజుకు రెండు లక్షలకు పైగా భోజనం సరఫరా అయ్యేది. సుమారు 10 లక్షల టీలు ఖర్చయ్యేవి. దీనికి తోడు 1.60 లక్షల లీటర్ల పాలు సేల్ అయ్యేవి. బేకరీ, ఫాస్ట్‌ఫుడ్, పాన్‌షాప్ దుకాణాలు కిటకిటలాడేవి ఐటీ కంపెనీలపై ఆధారపడి చాలా మంది క్యాబ్ సర్వీసులు నడిపే వారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండటంతో వారికి పని లేకుండా పోయింది. ఉబర్, ఓలా మినహాయిస్తే ప్రైవేటు క్యాబ్ డ్రైవర్లకు బెంగళూరులో జీవనం కూడా కష్టసాధ్యంగా మారింది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్‌లకు గిరాకీ లేకుండా పోయింది. కరోనాకు ముందు జనాలతో కిటకిటలాడే షాపులు కూడా నేడు వెలవెలబోతున్నాయి. ఐటీ ఉద్యోగులు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. దీంతో బెంగళూరుకు మూలాధారమైన ఆర్థిక వ్యవస్థకి గండి పడింది. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా ప్రతి నెలా సరాసరి రూ.10 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment