దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పోలీసుల యూనిఫారం విభిన్నంగా ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. అయితే చాలా రాష్ట్రాల్లో పోలీసుల యూనిఫారం ఖాకీ రంగులోనే ఉంటుంది. అయితే ఆ రాష్ట్రంలోని పోలీసుల యూనిఫారం మరింత విభిన్నంగా ఉంటుంది. అక్కడి పోలీసులు తలపై ఎర్రని రంగు టోపీ ధరిస్తారు. ఇటువంటి టోపీని ఏ రాష్ట్రంలోనూ ధరించరు. ఈ టోపీ తయారీ కూడా ఇతర టోపీల కన్నా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తరహాలోని టోపీని పెట్టుకున్న పోలీసులను ఎంత దూరం నుంచి అయినా ఇట్టే గుర్తించవచ్చు.
అయితే అక్కడి పోలీసులు ఎర్రని టోపీని ఎందుకు ధరిస్తారు? ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన చాలా ఏళ్ల తరువాత పుదుచ్చేరికి స్వాతంత్య్రం లభించింది. తరువాత అది భారత్‌లో భాగమయ్యింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించగా, పుదుచ్చేరి మాత్రం ఫ్రాన్స్ ఆధీనంలోనే ఉంది. అక్కడ ఫ్రాన్స్ న్యాయవ్యవస్థనే కొనసాగింది. అయితే 1954లో పుదుచ్చేరి భారత్‌లో విలీనమయ్యింది. అప్పటి నుంచి అక్కడ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతంగా మారింది.
దీని తరువాత పుదుచ్చేరిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే పోలీసులు ధరించే ఎరుపు రంగు టోపీ విషయంలో ఎటువంటి మార్పు రాలేదు. ఫ్రాన్స్ పోలీసులు ఎరుపురంగు టోపీని ధరిస్తారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఇక్కడి పోలీసులు ఎరుపురంగు టోపీ ధరించడానికి ఇదే ప్రధాన కారణం. అయితే ఎరుపు రంగు టోపీని ఇక్కడి పోలీసు విభాగంలోని ఉన్నతాధికారులు ధరించరు. కేవలం కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు మాత్రమే వీటిని ధరిస్తారు. అయితే వీరి టోపీలలో ఎంతో భిన్నత్వం కనిపిస్తుంది. కానిస్టేబుల్ ధరించే టోపీపై నలుపు రంగు గీత కనిపిస్తుంది. హెడ్‌కానిస్టేబుల్ టోపీపై పసుపు రంగు గీతలు కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment