ముంబై: ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు విషయమై ఆయన కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన ముంబై పోలీసులు ఈ చర్యకు పాల్పడింది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాగర్ బర్వేగా గుర్తించి సోమవారం అతడిని అరెస్టు చేశారు.
అదే గతి పడుతుంది..
కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపేస్తామంటూ ఒక వార్నింగ్ ప్రత్యక్షమైంది. ఆ బెదిరింపులో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్ కు ఎదురైన పరిస్థితి అతి త్వరలో శరద్ పవార్ కు కూడా ఎదురవుతుందని, 2013లో నరేంద్ర దభోల్కర్ ను ఇద్దరు ఆగంతకులు బైక్ మీద వచ్చి కాల్చి చంపినట్టే ఈయనను కూడా చంపుతామని పోస్ట్ చేశారు.
దీనిపై వెంటనే స్పందించిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ పోస్ట్ చేసిన వ్యక్తిని కనుగొనేందుకు విచారణ చేపట్టారు. ఆమెతో పాటు ఎన్సీపీ కార్యకర్త ఒకరు లోకమాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు.
ఎలా పట్టుకున్నారంటే..
ఈ వార్నింగ్ ఏ ఐపీ అడ్రస్ నుండి వచ్చిందన్న కోణంలో ఎంక్వైరీ చేయగా ఆ ఐపీ అడ్రస్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాగర్ బర్వేకు చెందినదని గుర్తించారు పోలీసులు. సాగర్ ఓ ప్రయివేటు కంపెనీలో డేటా ఫీడింగ్ అండ్ అనలిటిక్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. నిందితుడి వివరాలు తెలిసిందే తడవు వెంటనే సాగర్ బర్వేను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి రిమాండుకు తరలించారు పోలీసులు.
శరద్ పవార్ ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆయన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. నాయకత్వం చేతులు మారి పార్టీ కార్యాచరణ ముమ్మరం చేస్తున్న ఇదే సమయంలో ఆయనను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఆందోళనలో ఉన్నాయి పార్టీ వర్గాలు. ఎట్టకేలకు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి అరెస్టుతో ఎన్సీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఇది కూడా చదవండి: అలిగిన అజిత్ పవార్.. మరోసారి అసంతృప్తి?
Comments
Please login to add a commentAdd a comment