చండీగఢ్: పంజాబ్‌లో భారీ విజయంతో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా 184 మందికి సంబంధించిన భద్రతను ఉపసంహరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారికి ఉన్న ముప్పును అంచనా వేసి ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు బీబీ జాగీర్ కౌర్, మదన్ మోహన్ మిట్టల్, సుర్జిత్ కుమార్ రఖ్రా, సుచా సింగ్ చోటేపూర్, జనమేజా సింగ్ సెఖోన్, తోట సింగ్, గుల్జార్ సింగ్ రాణికే ఉన్నారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రులు, మంత్రుల కుటుంబానికి ఉన్న భద్రతను కూడా ఉపసంహరించారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, అమరీందర్ సింగ్ కుమారుడు రణిందర్ సింగ్ కుటుంబీకులు కూడా తమ భద్రతను కోల్పోనున్నారు.
భద్రత కోల్పోయినవారిలో మాజీ ఎంపీ, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఉన్నారు. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న మహి గిల్, మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ కుమారుడు సిధాంత్ కూడా భద్రతను కోల్పోనున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను ఆప్ ప్రభుత్వం తొలగించడం ఇది రెండోసారి కావాడం గమనార్హం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలకు చెందిన 122 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్చి 11న ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment