బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రెసిడెంట్, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ రేపు కర్ణాటకలో Karnataka Elections పర్యటించనున్నారు. కోలార్(కర్ణాటక)లో ఆదివారం నిర్వహిస్తున్న జై భారత్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అయితే ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ.. ఏం మాట్లాడబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఎందుకంటే..
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇదే కోలార్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆయన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. 2019 ఏప్రిల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోలార్‌లో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మోదీ ఇంటి పేరును ప్రస్తావించి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నేరపూరితమైన పరువు నష్టం దావా, ఈ కేసులో దోషిగా తేల్చిన సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఎంపీగా ఆయనపై అనర్హత వేటు పడడం.. ఇదంతా తెలిసిందే. దీంతో..
ఎంపీ పదవిపై వేటు పడిన అనంతరం అదే కోలార్‌లో ఆయన ప్రసంగిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. ఆచితూచీ మాట్లాడతారా? లేదంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అక్కడి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారా? అనేది చూడాలి. వాస్తవానికి ఈ ర్యాలీని తొలుత ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ, ఎన్నికల సన్నాహాకాలు, అభ్యర్థుల ఎంపికతో పాటు రాహుల్ గాంధీ కోర్టును ఆశ్రయించడం.. తదితర కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది కాంగ్రెస్.
కాంగ్రెస్‌కు కోలార్ ఎంతో ముఖ్యమైన స్థానం. ఇక్కడి నుంచి పోటీ చేయాలని(రెండో స్థానంగా) మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే వరుణ(మైసూర్)స్థానం నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమైంది. అయితే కాంగ్రెస్ మాత్రం కోలార్‌లో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.
ఆదివారం ఉదయం బెంగళూరుకు చేరుకోనున్న రాహుల్ గాంధీ.. నేరుగా కోలార్‌కు వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ జై భారత్ ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత బెంగళూరులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం సమీపంలో కొత్తగా నిర్మించిన ఇందిరా గాంధీ భవన్‌ను ప్రారంభిస్తారు. 750 మంది కూర్చునేలా ఆఫీస్ కమ్ ఆడిటోరియంగా దీనిని నిర్మించారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక జనరల్ సెక్రెటరీ ఇంఛార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment