
సూరత్: మోదీ ఇంటి పేరును అనుచితంగా వాడారనే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరఫున ఆయన న్యాయవాదులు గురువారం సూరత్ కోర్టులో వాదనలు వినిపించారు. ‘ నేర నిరూపణ విధానం సవ్యంగా లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టు జడ్జి అసమతుల్య సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని తీర్పు చెప్పారు.
ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో మొత్తం కేసు ఆధారపడింది. రాఫెల్ కేసులో రాహుల్ చెప్పిన బేషరతు క్షమాపణ అంశాన్ని ఈ కేసుకు సంబంధంలేకున్నా ఇందులో జతచేశారు. మరీ ఇంత పెద్ద శిక్షా ?. ఈ కేసులో గరిష్ట శిక్షను అమలుచేయాల్సిన అవసరం లేదు’ అని అదనపు సెషన్స్ జడ్జి ఆర్‌పీ మొగెరా ముందు రాహుల్ లాయర్ ఆర్‌ఎస్ ఛీమా వాదించారు.
శిక్షను నిలుపుదల చేయాలని కోరారు. ‘ దొంగలందరి ఇంటి పేరు మోదీ అనే ఎందుకుంది? అనే ప్రసంగం చేసే నాటికి రాహుల్ దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. దేశ ప్రజలపై ఆయన ప్రసంగ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రసంగాన్ని సంచలనం చేయాలనేది ఆయన ఉద్దేశ్యం.
ఇలాంటి పరువునష్టం కేసులు ఆయన వేర్వేరు చోట్ల చాలా ఎదుర్కొంటున్నారు. రాఫెల్ కేసులో అనుచిత వ్యాఖ్యలు, ఆనక క్షమాపణల తర్వాతా ఆయన ఇలాంటి ప్రసంగాలు చేశారు’ అని పరువునష్టం కేసు వేసిన పూర్ణేశ్ మోదీ తరఫు లాయర్ హర్షిత్ తోలియా వాదించారు. తర్వాత జడ్జి తీర్పును 20వ తేదీకి వాయిదావేశారు.
Comments
Please login to add a commentAdd a comment