
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొండడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై ఆదివారం విమర్శల దాడికి దిగారు. వ్యవసాయ సంస్కరణ బిల్లులు రైతులకు మరణ శాసనాలని అభివర్ణించారు. విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభ వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రైతులకు ప్రభుత్వం మరణ శాసనాలు తీసుకుందని ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మట్టి నుంచి బంగారం పండించే రైతు కంట కన్నీరు తెప్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందని ఆరోపించారు.
వ్యవసాయ బిల్లు పేరుతో రాజ్యసభలో రైతుల ఉసురు తీసేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గుపడిందని వ్యాఖ్యానించారు. రాహుల్ అంతకుముందు సేద్యం బిల్లులను మోదీ ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టంగా అభివర్ణించారు. ఈ చట్టాల నేపథ్యంలో రైతులు కనీస మద్దతు ధరను ఎలా పొందుతారు..? కనీస మద్దతు ధరకు ఎందుకు హామీ ఇవ్వరు? అంటూ ప్రశ్నలు సంథించారు. రైతులను పెట్టుబడిదారుల బానిసలుగా మోదీ మార్చుతున్నారని మరో ట్వీట్‌లో రాహుల్ మండిపడ్డారు. ఇక రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.
Comments
Please login to add a commentAdd a comment