ప్రతీకాత్మక చిత్రం
దేశ న్యాయవ్యవస్థలో ఇదొక విచిత్రమైన ఆదేశం!. సంతానం పొందే హక్కు కింద.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి భార్య కోర్టుకు ఎక్కింది. దీంతో భార్యతో కాపురం చేసుకునేందుకు వీలుగా.. సదరు భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది కోర్టు.
నంద్‌లాల్(34) అనే వ్యక్తి ఓ కేసులో అజ్మీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తమకు పిల్లలు కావాలని, అందుకు తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని ఆమె రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేసింది.
వాదనలు విన్న జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఫర్జాంద్ అలీతో కూడిన బెంచ్.. ఆమె భావోద్వేగాలని అర్థం చేసుకుంది. రుగ్వేదంతో పాటు అన్ని మతాల్లోనూ ఆడవాళ్లకు పిల్లలను కనే హక్కు ఉంటుందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సంప్రదాయాల్ని అమితంగా గౌరవించే మన దేశంలో గృహిణిలకు ఉన్న ప్రథమ హక్కు పిల్లల్ని కనడం అని, కాబట్టి అతనికి పదిహేను రోజుల పెరోల్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. నందలాల్‌కు గతంలోనూ కోర్టు పెరోల్ మంజూరు చేయించింది. 2021 మొదట్లో 20 రోజుల పెరోల్ ఇవ్వగా.. ఆ టైంలో అతని ప్రవర్తన సక్రమంగా ఉండడంతో ఈసారి మళ్లీ ఇస్తున్నట్లు తెలిపింది. నేరం చేసింది ఆమె భర్త అని, అలాంటప్పుడు ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు ఆమె సంతానం పొందే హక్కును ప్రాథమిక హక్కులతో పోలుస్తూ.. సదరు భర్తను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment