జైపూర్: తన రాజ్యసభ ఓటుకు రూ.25 కోట్లు ఆఫర్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్ గుఢా. కొద్ది రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము చెప్పిన అభ్యర్థికి ఓటు వేయాలని, అందుకు తనకు రూ.25 కోట్లు ఇవ్వజూపారని పేర్కొన్నారు సైనికుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి గుఢా. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజస్థాన్‌లో రాజకీయ దుమారానికి దారి తీశాయి. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) నుంచి 2019లో కాంగ్రెస్‌లో చేరారు రాజేంద్ర. 2020లో సీఎం అశోక్ గెహ్లోత్‌పై తిరుగుబాటు చేయాలంటూ.. రూ.60 కోట్ల ఆఫర్ వచ్చిందన్నారు.
అయితే.. ఆ రెండు ఆఫర్లను తాను తిరస్కరించానని పేర్కొన్నారు మంత్రి రాజేంద్ర సింగ్ గూఢా. కానీ, ఏ నేత, పార్టీ పేరును ప్రస్తావించకుండానే ఈ ఆరోపణలు చేశారు. ఝుంఝునులో సోమవారం ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు..‘ఓ వ్యక్తికి ఓటు వేసేందుకు నాకు రూ.25 కోట్ల ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నా భార్యను అడిగాను. డబ్బులు వద్దు మంచి పేరుంటేచాలని నాతో ఆమె చెప్పింది. అలాగే.. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు.. నాకు రూ.60 కోట్ల ఆఫర్ వచ్చింది. అప్పుడు నా కుటుంబం, నా భార్య, కుమారుడు, కూతురిని అడిగాను. వారు డబ్బులు వద్దని చెప్పారు. అలా ఆలోచించే వారు మీతో ఉంటే అంతా మంచే జరుగుతుంది.’ అని సమాధానమిచ్చారు మంత్రి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ తరపున గెలిచిన ఆరుగులు ఎమ్మెల్యేల్లో రాజేంద్ర గుఢా ఒకరు. 2019లో కాంగ్రెస్‌లో చేరారు. 2020, జులైలో సచిన్ పైలట్ సహా మరో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు.. గెహ్లోత్ క్యాంప్‌లోనే ఉన్నారు గుఢా. 2021లో మంత్రివర్గ విస్తరణలో గుఢాకు సహాయ మంత్రి పదవి దక్కింది. తమ ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఆఫర్ ఇస్తూ తమ ప్రభుత్వాన్ని బీజేపీ అస్తిరపరచాలని చూస్తోందని పలు వేదికల మీదుగా ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్. ఈ ఏడాది జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. స్వతంత్ర అభ్యర్థి సుభాశ్ చంద్రకు బీజేపీ మద్దతు తెలిపింది. ముగ్గురు కాంగ్రెస్, ఒకరు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి: తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్ డోస్ పంపిణీ పూర్తవగానే అమలులోకి!
Comments
Please login to add a commentAdd a comment