దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ హత్య వెనక పాక్ ఉగ్ర ముఠా హస్తం ఉందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రకోణం నేపథ్యంలో కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించింది. తాజాగా ఈ కేసులోని ఇద్దరు నిందితుల్లో ఒకరికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేసే సున్నీ ఇస్లామిస్ట్ సంస్థ అయిన దావత్-ఎ-ఇస్లామి అనే సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలకు బలం చేకూరేలా.. ఇద్దరు నిందితుల్లో ఒకరు 2014 కరాచీలోని పాక్ తీవ్రవాద సంస్థ దావత్-ఎ- ఇస్లామీకి వెళ్లినట్లు రాజస్థాన్ డీజీపీ ఎంఎల్ లాథర్ పేర్కొన్నారు. ఈ గ్రూప్ వ్యక్తులు కాన్పూర్‌లో చూరుకుగా ఉన్నారని, ఢిల్లీ, ముంబైలలో ఈ సంస్థ కార్యాలయాలు ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా నిందితులిద్దరు మహ్మద్ రియాజ్, గౌస్ మహ్మద్‌లపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డిజిటల్ ఆధారాలను కూడా తనిఖీ చేస్తున్నామని డీజీపీ లాథర్ వెల్లడించారు.
చదవండి: ఉదయ్‌పూర్ ఘటన; భయపడినట్టుగానే జరిగింది
కాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్‌ను ఇద్దరు దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకు ఉదయ్‌పూర్‌లో ఒక టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. హత్యను కెమెరాలో రికార్డ్ చేసి.. తామే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు హంతకులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
కన్హయ్య లాల్‌ను హత్య చేసిన హంతకులు గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్‌లుగా గుర్తించారు. మొత్తం ఉదయ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించడంతోపాటు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కాగా మృతుడు కన్హయ్య కుటుంబానికి రూ.31 లక్షల పరిహారంతోపాటు ఇద్దరు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయ్‌పూర్‌లో పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించింది.
చదవండి: ఉదయ్‌పూర్ ఘటన: ఖబడ్దార్.. కన్హయ్యను చంపినట్లే చంపుతాం!
Comments
Please login to add a commentAdd a comment