సాక్షి,న్యూఢిల్లీ: అల్లోపతిపైన, డాక్టర్లపైనా సంచలన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యోగా గురు బాబా రాందేవ్ యూ టర్న్ తీసుకున్నారు. వైద్యులు దేవుని దూతల్లాంటి వారంటూ తాజాగా పేర్కొన్నారు. తన పోరాటం వైద్యులపై కాదు, మాదకద్రవ్యాల మాఫియాకు వ్యతిరేకంగా అంటూ ప్రకటించారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, టీకాలు తీసుకున్న తరువాత కూడా వేలాది మంది వైద్యులు మరణించారంటూ దుమారాన్ని రాజేసిన ఆయన త్వరలోనే తాను కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం అయిన జూన్ 21 నుంచి అందరికీ ఉచిత టీకా అందుబాటులో రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు.
శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని చెప్పారు రాందేవ్. తాను భారతీయ వైద్యవ్యవస్థని ద్వేషించడం లేదని తెలిపారు. తన పోరాటం డ్రగ్ మాఫియాపై మాత్రమేనని రాందేవ్ పేర్కొన్నారు. అయితే ప్రాణాంతక ఇతర వ్యాధులు, తీర్చలేని రుగ్మతలు పురాతన పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని ఆయుర్వేదంలో ఉందన్నారు. కానీ అవసరమైన మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపీడీ చేయకూడదని ఆయన హితవు పలికారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న జనరిక్ మెడిసిన్ తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు వేసేలా మోదీ చారిత్రాత్మక ప్రకటన చేశారనీ, ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కోరారు. యోగా, ఆయుర్వేదాన్ని ప్రజలంతా ఆచరించాలని, వ్యాధుల నివారణలో యోగా రక్షణ కవచంలా ఉంటుందనీ, ముఖ్యంగా కరోనా నుండి యోగా రక్షిస్తుందని రాందేవ్ పేర్కొన్నారు.
కాగా వ్యాక్సిన్ సమర్థత, అల్లోపతిని, వైద్యులను కించపరిచేలా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మండిపడింది. రాందేవ్‌కు లీగల్ నోటీసు లిచ్చింది. దీంతోపాటు కేంద్ర ఆరోగ్యమంత్రికి, ప్రధానికి లేఖ రాసింది. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు రాందేవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా బుధవారం ఐఎంఎ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రాందేవ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
చదవండి : వ్యాక్సిన్లపై రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
DRDO: 2-డీజీ డ్రగ్, కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment