సాక్షి, న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా పలువురు ప్రముఖల పేర్లను నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సహా పలువురు ఉన్నారు. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన చేసింది కేంద్రం. కొత్తగా నియామకమైన సభ్యులతో సహా పీఎం కేర్స్ ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమైన మరుసటి రోజునే ఈ ప్రకటన వెలువడింది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు.
‘పీఎం కేర్స్ ఫండ్‌లో అంతర్గతంగా భాగమైనందుకు ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు.’ అని ఓ ప్రకటన చేసింది ప్రధాని కార్యాలయం. ఇతర ట్రస్టీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలు ఉన్నారు. మరోవైపు.. పీఎం కేర్స్ ఫండ్ సలహాదారుల బోర్డుకు కాగ్ మాజీ అధికారి రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకులు ఆనంద్ షాలను నామినేట్ చేసింది కేంద్రం.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన క్రమంలో అత్యవసర సహాయ చర్యల కోసం 2020లో పీఎం కేర్స్ ఫండ్ ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని ఎక్స్ అఫీసియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. పీఎం కేర్స్‌కు విరాళాలు ఇచ్చిన వారందరికీ పన్ను మినహాయింపు వర్తింపుజేశారు. అలాగే.. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు గత ఏడాది మే 29న పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4వేలకుపైగా చిన్నారుకు ఈ నిధి ద్వారా సాయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఇదీ చదవండి: పీఎం కేర్స్‌కు 4,345 మంది ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment