న్యూఢిల్లీ: భారత్‌లో గురువారం రికార్డు స్థాయిలో 69,652 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28,36,925కు చేరుకుంది. గత 24 గంటల్లో 58,794 మంది కోలుకోగా, 977 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 53,866కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,96,664కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,86,395 గా ఉంది.
దేశంలో కరోనా రికవరీ రేటు 73.91 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల్లో కేవలం 0.28 శాతం కేసులు మాత్రమే వెంటిలేటర్ వరకూ వెళుతున్నాయని వెల్లడించింది. ఐసీయూలో 1.92 శాతం కేసులు ఉన్నాయని, ఆక్సిజన్ సపోర్ట్ మీద 2.62 శాతం ఉన్నాయని చెప్పింది. మరణాల రేటు 1.90 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజా 977 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 346 మంది మరణించారు.
మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీలు ఉన్నాయి. ఆగస్టు 19 వరకు 3,26,61,252 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. బుధవారం మరో 9,18,470 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. కేంద్ర రాష్ట్రా లు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 1,476 ల్యాబ్‌లలో పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది.
24 గంటలు.. 9 లక్షల పరీక్షలు..
గడచిన 24 గంటల్లో 9,18,470 శాంపిళ్లను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకూ ఒక్క రోజులో జరిపిన అత్యధిక పరీక్షల సంఖ్య ఇదే కావడం గమనార్హం. ఈ సంఖ్యను 10లక్షలకు తీసుకెళ్లడమే లక్ష్యమని కేంద్రం చెబుతోంది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,26,61,252కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8% కంటే తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో టెస్ట్స్ పర్ మిలియన్ 23,668కి చేరినట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment