దేశ రాజధాని ఢిల్లీలో రేపు (శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కర్తవ్య పథ్’లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించాలనే ఆసక్తి కలిగినవారి కోసం ఈ వివరాలు..
పరేడ్ జరిగే సమయం
రిపబ్లిక్ డే పరేడ్ జనవరి 26న ఉదయం 10:30 గంటలకు విజయ్ చౌక్ నుండి కర్తవ్య పథ్ వరకు సాగుతుంది. ఈ పరేడ్‌ను 77 వేల మంది కూర్చుని తిలకించవచ్చు. ఇందుకు ఏర్పాటు చేసిన కుర్చీలలో 42 వేల సీట్లను సాధారణ పౌరులకు కేటాయించారు.
ఇది కూడా చదవండి: ‘కర్తవ్య పథ్’లోనే గణతంత్ర దినోత్సవాలు ఎందుకు?
గణతంత్ర దినోత్సవ థీమ్
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్‌తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది.
ముఖ్య అతిథి
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన ముందుగా జనవరి 25న జైపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అదే రోజున రాష్ట్రపతిని, ప్రధాని నరేంద్ర మోదీని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కలుసుకోనున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. జనవరి 26న ఆయన రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసే ‘ఎట్ హోమ్’ రిసెప్షన్‌కు హాజరవుతారు.
పరేడ్ టిక్కెట్ ధర ఎంత? ఎలా తీసుకోవాలి?
రిపబ్లిక్ డే పరేడ్ టిక్కెట్లు రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంటాయి. అన్‌రిజర్వ్‌డ్ సీట్లకు రూ. 500, రూ. 100 రూ. 20 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈ టిక్కెట్లను ఎలా కొనుగోలు చేయాలంటే..
1) రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
2) పేరు, ఈ- మెయిల్ ఐడీ, చిరునామా, మొబైల్ నంబర్ మొదలైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్‌లో వచ్చిన ఓటీపీని తెలియజేయడం ద్వారా మీ గుర్తింపును ధృవీకరించాల్సి ఉంటుంది.
3) పరేడ్‌లో ఎఫ్‌డీఆర్ రిపబ్లిక్ డే పరేడ్, రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ ది రిట్రీట్ ఈవెంట్లు ఉంటాయి. దీనిలో టిక్కెట్ కొనుగోలుదారు తనకు కావలసిన ఈవెంట్‌ను ఎంచుకోవచ్చు.
4) టిక్కెట్ కొనుగోలుదారు తన ధృవీకరణ కోసం పేరు, చిరునామా, వయస్సు, లింగం, ఫోటో ఐడీ (డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్) జెరాక్స్ కాపీని సమర్పించాలి.
5) కొనుగోలు చేయాలనుకుంటున్న టిక్కెట్ల సంఖ్యను ఎంచుకోవాలి. టిక్కెట్ల వర్గం ప్రకారం చార్జీలను చెల్లించాలి.
6) టిక్కెట్ల చార్జీలను చెల్లించిన తర్వాత క్యూఆర్ కోడ్‌తో పాటు బుకింగ్ వివరాలు కలిగిన నిర్ధారణ ఇమెయిల్, ఎస్‌ఎంఎస్ అందుతుంది.
7) ఈ-టికెట్ హార్డ్ కాపీని అందుకున్నాక, టిక్కెట్ కొనుగోలుదారు తన ఒరిజినల్ ఫోటో. ఐడీలను పరేడ్‌లకు వెళ్లేటప్పుడు వెంట తీసుకువెళ్లాలి. వేదిక ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ప్రవేశం పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment