కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా కోర్టు ఎనిమిది రోజల సీబీఐ కస్టడీ విధించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోషతో పాటు, మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ వారిని సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో సందీప్ ఘోష్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో విచారించడానికి నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోల్‌కతా కోర్టును కోరింది. అయితే కోర్టు ఎనిమిది రోజులు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. ఇందులో ఒక నిందితుడైన అఫ్సర్ అలీ బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సందీప్ ఘోష్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుపై కోల్‌కతా పోలీసులు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినప్పటికీ కలకత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో సోమవారం సీబీఐ సోదాలు జరిపి అనంతరం అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment