
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంబా జిల్లాలోని తీసా సబ్ డివిజన్ వద్ద బుధవారం ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. చంబా నుంచి తీసాకు వెళ్తున్న బస్సు చంబా-ఖజ్జియార్ రహదారిపై ప్రమాదానికి గురైంది. మూల మలుపు వద్ద బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పిందని తెలుస్తోంది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు లోయలో పడిందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చంబాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై హిమాచల్ ముఖ్యమంత్రి జయరాం ఠాగూర్ స్పందించారు. ఈ దుర్ఘటనకు గల కారణాలపై పూర్తి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా చాంబా జిల్లాలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది మార్చి నెలలోనూ హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సు లోయలో పడి ఐదుగురు ప్రయాణికులు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment