Chamba district
-
ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం
ఉనా/చంబా: దేశంలో గత ప్రభుత్వాలు ఉద్ధరించిందేమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇతర దేశాల్లో గత శతాబ్దంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సైతం మన ప్రభుత్వాలు ప్రజలకు కల్పించలేకపోయాయని ఆక్షేపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో మోదీ గురువారం పర్యటించారు. ఉనా, చంబాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. హరోలీలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఉనాలో ‘ఐఐఐటీ–ఉనా’ను ప్రారంభించారు. చంబాలో రెండు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉనాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపారు. దేశంలో ఇది నాలుగో వందేభారత్ రైలు కావడం విశేషం. రాష్ట్రంలో పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. హిమాచల్‌లో ప్రతి ఎన్నికలో అధికార పార్టీని ఓడించే సంప్రదాయం ఈసారి ఆగిపోతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘డబుల్–ఇంజన్’ ప్రభుత్వాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఉద్ఘాటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అందుకే ఇక్కడ అభివృద్ధి యజ్ఞం జరుగుతోందని అన్నారు. 20వ శతాబ్దంతోపాటు 21వ శతాబ్దపు సౌకర్యాలను కూడా ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. 21వ శతాబ్దపు భారతదేశ ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని, మన దేశం సవాళ్లను అధిగమిస్తూ శరవేగంగా పురోగమిస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ స్టైలే వేరు బీజేపీ వర్కింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుందని మోదీ చెప్పారు. అడ్డంకులు సృష్టించడం, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, తప్పుదోవ పట్టించడం వంటి వాటికి తమ పాలనలో స్థానం లేదన్నారు. నిర్ణయాలు తీసుకుంటామని, తీర్మానాలు చేస్తామని, వాటిని అమలు పరుస్తామని, చివరకు ఫలితాలు చూపిస్తామని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఊపందుకుందన్నారు. 3,125 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన–3’ని చంబాలో మోదీ ప్రారంభించారు. డబుల్–ఇంజన్ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 12,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందని తెలిపారు. ప్రధాని ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉనా నుంచి ఢిల్లీకి బుధవారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణిస్తుంది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంబా జిల్లాలోని తీసా సబ్ డివిజన్ వద్ద బుధవారం ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. చంబా నుంచి తీసాకు వెళ్తున్న బస్సు చంబా-ఖజ్జియార్ రహదారిపై ప్రమాదానికి గురైంది. మూల మలుపు వద్ద బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పిందని తెలుస్తోంది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు లోయలో పడిందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చంబాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై హిమాచల్ ముఖ్యమంత్రి జయరాం ఠాగూర్ స్పందించారు. ఈ దుర్ఘటనకు గల కారణాలపై పూర్తి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా చాంబా జిల్లాలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది మార్చి నెలలోనూ హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సు లోయలో పడి ఐదుగురు ప్రయాణికులు మరణించారు. -
చంబాలో కుప్పకూలిన బ్రిడ్జి
-
చంబాలో కుప్పకూలిన బ్రిడ్జి
చంబా : హిమాచల్ ప్రదేశ్ చంబాలో కాంక్రీట్ బ్రిడ్జి కూలి ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, హిమాచల్ ప్రదేశ్‌లోని చాంబా ప్రాంతాన్ని కలిపే ఈ వంతెన గురువారం కూలిపోవడంతో.. దానిపై ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జవహర్ లాల్ నెహ్రు మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుదేశ్ కుమార్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...నిర్మించేటప్పుడు నాసిరకం మెటీరియల్ వాడడం వల్లే బ్రిడ్జి కూలిపోయినట్టు భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే బ్రిడ్జి నిర్మాణపు మ్యాప్‌లో లోపాలు కూడా ప్రమాదానికి కారణం కావచ్చని, దీనిపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై కారు, మిని ట్రక్‌తో పాటు ద్విచక్ర వాహనం వెళుతున్నాయి, అయితే ఒక్కసారిగా బ్రిడ్జి కూలడంతో బైక్ నదిలో పడిపోతే, కారు, మిని ట్రక్ చిక్కుకు పోయాయి. కాగా 15 ఏళ్ల క్రితం నాబార్డు నిధుల కింద ఈ బ్రిడ్జిని నిర్మించారు. అయితే కాంట్రాక్టర్ల కక్కుర్తి, అలసత్వం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
బస్సు ప్రమాదంలో 14 మంది మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో మినీ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చంబా పట్టణం నుంచి హిమగిరికి ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోని అధిక వేగంతో బస్సును నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై సీఎం వీరభద్ర సింగ్, గవర్నర్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సహయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకోవడం, అధిక వేగంతో ప్రయాణించడంతో హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఏడాది దాదాపు 1000 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో 556 ప్రదేశాలలో ప్రమాదాలు అధికంగా జరుతున్నట్లు పోలీసులు గుర్తించారు.