బస్సు ప్రమాదంలో 14 మంది మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో మినీ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చంబా పట్టణం నుంచి హిమగిరికి ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోని అధిక వేగంతో బస్సును నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై సీఎం వీరభద్ర సింగ్, గవర్నర్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సహయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకోవడం, అధిక వేగంతో ప్రయాణించడంతో హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఏడాది దాదాపు 1000 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో 556 ప్రదేశాలలో ప్రమాదాలు అధికంగా జరుతున్నట్లు పోలీసులు గుర్తించారు.