చంబా : హిమాచల్ ప్రదేశ్ చంబాలో కాంక్రీట్ బ్రిడ్జి కూలి ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, హిమాచల్ ప్రదేశ్‌లోని చాంబా ప్రాంతాన్ని కలిపే ఈ వంతెన గురువారం కూలిపోవడంతో.. దానిపై ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జవహర్ లాల్ నెహ్రు మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుదేశ్ కుమార్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...నిర్మించేటప్పుడు నాసిరకం మెటీరియల్ వాడడం వల్లే బ్రిడ్జి కూలిపోయినట్టు భావిస్తున్నట్లు తెలిపారు.
అలాగే బ్రిడ్జి నిర్మాణపు మ్యాప్‌లో లోపాలు కూడా ప్రమాదానికి కారణం కావచ్చని, దీనిపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై కారు, మిని ట్రక్‌తో పాటు ద్విచక్ర వాహనం వెళుతున్నాయి, అయితే ఒక్కసారిగా బ్రిడ్జి కూలడంతో బైక్ నదిలో పడిపోతే, కారు, మిని ట్రక్ చిక్కుకు పోయాయి. కాగా 15 ఏళ్ల క్రితం నాబార్డు నిధుల కింద ఈ బ్రిడ్జిని నిర్మించారు. అయితే కాంట్రాక్టర్ల కక్కుర్తి, అలసత్వం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment