ఉనా/చంబా: దేశంలో గత ప్రభుత్వాలు ఉద్ధరించిందేమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇతర దేశాల్లో గత శతాబ్దంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సైతం మన ప్రభుత్వాలు ప్రజలకు కల్పించలేకపోయాయని ఆక్షేపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో మోదీ గురువారం పర్యటించారు. ఉనా, చంబాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
హరోలీలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఉనాలో ‘ఐఐఐటీ–ఉనా’ను ప్రారంభించారు. చంబాలో రెండు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉనాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపారు. దేశంలో ఇది నాలుగో వందేభారత్ రైలు కావడం విశేషం. రాష్ట్రంలో పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. హిమాచల్‌లో ప్రతి ఎన్నికలో అధికార పార్టీని ఓడించే సంప్రదాయం ఈసారి ఆగిపోతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
‘డబుల్–ఇంజన్’ ప్రభుత్వాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఉద్ఘాటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అందుకే ఇక్కడ అభివృద్ధి యజ్ఞం జరుగుతోందని అన్నారు. 20వ శతాబ్దంతోపాటు 21వ శతాబ్దపు సౌకర్యాలను కూడా ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. 21వ శతాబ్దపు భారతదేశ ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని, మన దేశం సవాళ్లను అధిగమిస్తూ శరవేగంగా పురోగమిస్తోందని వ్యాఖ్యానించారు.
బీజేపీ స్టైలే వేరు
బీజేపీ వర్కింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుందని మోదీ చెప్పారు. అడ్డంకులు సృష్టించడం, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, తప్పుదోవ పట్టించడం వంటి వాటికి తమ పాలనలో స్థానం లేదన్నారు. నిర్ణయాలు తీసుకుంటామని, తీర్మానాలు చేస్తామని, వాటిని అమలు పరుస్తామని, చివరకు ఫలితాలు చూపిస్తామని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఊపందుకుందన్నారు. 3,125 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన–3’ని చంబాలో మోదీ ప్రారంభించారు. డబుల్–ఇంజన్ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 12,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందని తెలిపారు. ప్రధాని ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉనా నుంచి ఢిల్లీకి బుధవారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment