Rozgar Mela: వేగవంతమైన వృద్ధి బాటలో మన ఆర్థికం | Rozgar Mela: PM Modi distributes 51k appointment letters to new recruits in CAPF, Delhi Police | Sakshi
Sakshi News home page

Rozgar Mela: వేగవంతమైన వృద్ధి బాటలో మన ఆర్థికం

Aug 29 2023 5:31 AM | Updated on Aug 29 2023 5:31 AM

Rozgar Mela: PM Modi distributes 51k appointment letters to new recruits in CAPF, Delhi Police - Sakshi

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. సోమవారం రోజ్‌గార్‌ మేళాలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. కేంద్ర పారామిలటరీ దళాలు, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు.

ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, పర్యాటకం, ఆహార శుద్ధి రంగాల్లో మరింత వృద్ధి నమోదవుతుందని, యువతీ యువకులకు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు మోదీ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని పునరుద్ఘాటించారు. అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు అందుతాయని అన్నారు. అన్ని రంగాల అభివృద్ధితోనే ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని చెప్పారు.

కోట్లాది కొత్త కొలువులు  
దేశంలో 2030 నాటికి టూరిజం రంగంలో కొత్తగా దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటా రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ వివరించారు. ఫార్మాస్యూటికల్‌ రంగం వాటా రూ.4 లక్షల కోట్లుగా ఉందని, 2030 నాటికి ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఫార్మా రంగంలో యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఆటోమొబైల్‌ రంగంలోనూ యువ శక్తి భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఆహార శుద్ధి రంగం విలువ ప్రస్తుతం రూ.26 లక్షల కోట్లుగా ఉందని, మరో మూడున్నరేళ్లలో ఇది ఏకంగా రూ.35 లక్షల కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి పరిశ్రమ విస్తరిస్తున్నకొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతూనే ఉంటుందని ఆయన అన్నారు.  
 
ఇక ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు  

సుపరిపాలన, చట్టబద్ధ పాలన ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, అందుకు ఉత్తరప్రదేశ్‌ ఒక ఉదాహరణ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. వేగవంతమైన అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలన్నారు. నేరాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలకు పెట్టుబడులు పెద్దగా రావడం లేదని, ఉద్యోగ అవకాశాలు పడిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు.

గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల మార్పు కనిపిస్తోందన్నారు.  గత ఏడాది రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయన్నారు.  వస్తూత్పత్తి ఊపందుకుందని, ఉద్యోగాల సంఖ్య పెరగడంతో కుటుంబాల ఆదాయం పెరిగినట్లు మోదీ తెలిపారు. ఎల్రక్టానిక్‌ పరికరాల తయారీపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మేడ్‌ ఇన్‌ ఇండియా ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత కంప్యూటర్లు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పారా మిలటరీ దళాల్లో కొత్తగా చేరిన వారిని మోదీ ‘అమృత్‌ రక్షకులు’గా అభివరి్ణంచారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement