సేలం (తమిళనాడు) : కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి అప్పుల పాలయ్యారు. లాక్‌డౌన్‌లో ఉద్యోగం కోల్పోయి కుటుంబాన్ని పోషించేందుకు చేసిన అప్పులు తీర్చేందుకు కన్నకొడుకునే అమ్ముకున్న దీనగాథ తమిళనాడులోని సేలంలో వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఆరు నెలల పసికందుని లక్ష రుపాయలకు అప్పుతీర్చడం కోసం అమ్ముకున్నాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సదరు వ్యక్తిని, అతడికి సహాయం చేసిన స్నేహితుడిని, పిల్లాడిని కొన్నవారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లాలోని లైన్‌మెడు ప్రాంతంలో నివసిస్తున్న షౌకత్ అలీ భార్య షర్మిలా బానో ఆరు నెలల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. షర్మిల మామయ్య పిల్లాడిని చూడటానికి సోమవారం రాగా, వారితో అలీ వారం ముందే పిల్లాడు చనిపోయాడని చెప్పాడు. వారం రోజుల ముందే చిన్నారి చనిపోతే తమకు సమాచారం ఇవ్వకపోవడం, చుట్టుపక్కల ప్రజలకు కూడా ఈ విషయం తెలియకపోవడంతో అనుమానం వచ్చి అతని మామయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. షౌకత్, షర్మిలాను పోలీసులు గట్టిగా అడిగే సరికి ఇద్దరూ తమ బిడ్డను లక్ష రూపాయలకు అమ్మారని అంగీకరించారు. లాక్‌డౌన్ సమయంలో తాను ఉద్యోగం కోల్పోవడంతో, ఆర్థిక ఇబ్బందుల కారణంగా లక్ష రూపాయల వరకు అప్పు చేశానని, రుణం తిరిగి చెల్లించలేక బిడ్డను అమ్మాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment