selam district
-
లైంగిక వేధింపులు బయట పడుతాయని హత్య.. నిందితుడికి ఉరిశిక్ష
సేలం( తమిళనాడు): మైనర్ తల నరికి దారుణంగా హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష, రూ. 25 వేలు జరిమానా విధిస్తూ సేలం కోర్టు మంగళవారం తీర్పిచ్చింది. వివరాలు.. సేలం జిల్లా, ఆత్తూర్ సమీపంలో తలవాయ్‌పట్టి గ్రామానికి చెందిన దినేష్‌కుమార్ (33) వరికోత వాహనంలో పని చేస్తున్నాడు. ఇతను 2018, అక్టోబర్ 20న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదేప్రాంతంలో ఉన్న దళిత వర్గానికి చెందిన సామువేల్ కుమార్తె అయిన మైనర్ పువ్వులు కట్టడానికి దారం కోసం వచ్చింది. అప్పుడు దినేష్‌కుమార్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు చెబుతానంటూ వెళ్లిపో యింది. లైంగిక వేధింపుల విషయం ఎక్కడ బయట పడిపోతుందోననే భయంతో దినేష్ కుమార్ ఆమెను ఇంటికి వెళ్లి దూషించాడు. అంతటితో ఆగకుండా తల్లి కళ్ల ఎదుటే ఆమె తలను తెగనరికి హత్య చేశాడు. తర్వాత ఆత్తూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ హత్యపై పోలీసులు ఐదు విభాగాల కింద కేసు నమోదు చేసి దినేష్ కుమార్‌ను అరెస్టు చేశారు. దళిత వర్గానికి చెందిన మైనర్ దారుణ హత్యకు గురైన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ కేసుపై సేలం ఫోక్సో ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ తరపు న్యాయవాది ఎ.ఆసైతంబి వాదించారు. మరెవరికీ.. కేసు విచారణ ముగిసి మంగళవారం న్యాయమూర్తి ఎం.మురుగానంద్ తుది తీర్పు ఇచ్చారు. హత్య చేసినందుకు దినేష్ కుమార్‌కు ఉరిశిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా జీవిత ఖైదు, రూ. 5 వేలు జరిమానా, మరో మూడు విభాగాల కింద 10, 6 సంవత్సరాలు, 4 నెలలు జైలు శిక్షను, తలా రూ. 5 వేలు వంతున జరిమానా విధించారు. మైనర్ తల్లిదండ్రులు సామువేల్, చిన్నపొన్ను మాట్లాడుతూ.. తమ కుమార్తెకు జరిగిన దారుణం మరెవరికీ జరగకూడదని, ఈ తీర్పు తమకు కాస్త ఊరట నిచ్చినట్లు తెలిపారు. ఈ వార్త కూడా చదవండి: కనికరించలేదు.. సింగపూర్‌లో ‘మానసిక వికలాంగుడు’ నాగేంద్రన్ను ఉరి తీశారు -
కళ్లకు గంతలు కట్టుకుని కాపీరైట్
సేలం: కళ్లకు గంతలు కట్టుకుని మరో పాఠ్య పుస్తకంలోని పాఠాలను మనోనేత్రంతో పసిగట్టి నోటు పుస్తకంలో రాసి సేలం విద్యార్థిని వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. సేలం మనక్కాడులో కామరాజర్ నగరవై మహిళా మహోన్నత ప్రభుత్వ పాఠశాల ఉంది. వివరాలు.. ఎబియా (14) తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్ననాటి నుంచి ఏదైనా సాధించాలనే మనస్తత్వం కలిగిన ఎబియా కళ్లకు గంతలు కట్టుకుని వేరే పాఠ్య పుస్తకంలోని పాఠ్యాంశాలను నోటు పుస్తకంలో రాసే విధంగా ప్రాక్టీస్ చేసింది. ఈ కార్యక్రమం పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించారు. హెచ్ఎం మేయర్ రామచంద్రన్, డిప్యూటీ పోలీసు కమిషనర్ మాడసామి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎబియా సైన్స్ పాఠ్యాంశాలను మూడు గంటల పాటు మనోనేత్రంలో పసిగట్టి నోటు పుస్తకంలో రాసి ఎబియా నోబుల్ బుక్ ఆఫ్ వర్డ్ రికార్డ్ పుస్తకంలో స్థానం పొందింది. -
మృతి చెందిన భర్తకు ఇంట్లోనే విగ్రహం
సేలం: అకస్మాత్తుగా అనారోగ్యం పాలై మృతి చెందిన భర్తకు ఇంటిలోనే విగ్రహం చేర్పాటు చేసి భార్య పూజలు చేస్తున్న ఘటన సేలంలో చోటు చేసుకుంది. వివరాలు.. సేలంలోని ఏర్కాడు ప్రధాన సాలైలోని, కేంద్ర న్యాయ కళాశాల సమీపంలో ఉన్న అన్నై ఇందిరాగాంధీ నగర్ 3వ అవెన్యూకు చెందిన శశికుమార్. ఇతని భార్య గోమతి. వీరికి కుమారుడు వేల్ కుమార్, కుమార్తె శైలశ్రీ ఉన్నారు. బ్యాంకు మేనేజర్‌గా పని చేసి శశికుమార్ పదవీ విరమణ పొందారు. తర్వాత సమాజ సేవలో పాల్గొనేవారు. ఈ స్థితిలో గత 2019లో శశికుమార్ అనారోగ్యం కారణంగా ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగింది. భర్తను కోల్పోయిన గోమతి, తన భర్త ఇంటి ప్రాంగణంలోనే ఒక మండపాన్ని ఏర్పాటు చేసి, అందులో శశికుమార్ విగ్రహాన్ని ఉంచి.. నిత్యం ఆయనకు పూజలు చేస్తోంది. ఈ పూజలను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. -
తమిళనాడులో జడ్జిపై హత్యాయత్నం
సాక్షి, చెన్నై: కోర్టు విధుల నుంచి బదిలీ చేశారనే ఆగ్రహంతో ఓ ఆఫీస్ అసిస్టెంట్ న్యాయమూర్తిపై ఏకంగా హత్యకు యత్నించిన ఘటన తమిళనాడులో మంగళవారం చోటు చేసుకుంది. సేలం జిల్లా అస్థంపట్టిలో 24 కోర్టుల సముదాయం ఉంది. నాలుగో నేరవిభాగం కోర్టులో పొన్ పాండి న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేసుల విచారణ నిమిత్తం మంగళవారం ఉదయం 11 గంటలకు కోర్టుకు చేరుకోగా అక్కడే పొంచి ఉన్న ప్రకాష్ అనే ఆఫీస్ అసిస్టెంట్ అకస్మాత్తుగా ఆయన్ను కత్తితో పొడవబోయాడు. అప్రమత్తమైన న్యాయమూర్తి కత్తిని అడ్డుకోగా చేతికి బలమైన గాయమైంది. అక్కడే ఉన్న వారు ప్రకాష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓమలూరు అనే ప్రాంతంలోని కోర్టుకు ప్రకాష్ ఇటీవల బదిలీ అయ్యాడు. దీనిపై అతడు జడ్జితో గొడవపడినట్లు సమాచారం. ఈ కక్షతోనే దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
వీడియో తీయడంతో అడ్డంగా బుక్కైన వసూల్ రాజాలు
సాక్షి, చెన్నై : వాహనాల నుంచి డబ్బు వసూలు చేస్తున్న పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. సేలం జిల్లా ఓమలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సెల్వమణి, ప్రత్యేక ఎస్ఐ సెల్వమణి ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి విమానాశ్రయం కార్గో నుంచి వచ్చే వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. శుక్రవారం యూనిఫాం కూడా ధరించకుండా ప్రైవేటు వాహనంలో వచ్చి వాహనాల తనిఖీ చేపట్టారు. కార్గో నుంచి బయటకు వచ్చిన ఓ లారీని ఆపేశారు. అన్ని పేపర్లు ఉన్నాయని, చూడాలని డ్రైవర్ చెప్పినా ఇన్స్పెక్టర్ వినలేదు. డబ్బు ఇచ్చి కదలాలని ఆదేశించారు. ఈ దృశ్యాన్ని క్లీనర్ తన సెల్ ద్వారా వీడియో తీసి ట్రాన్స్‌పోర్టు సంస్థకు పంపించాడు. అక్కడి సిబ్బంది ఆ ఇన్స్పెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. అలాగే జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు శనివారం వీడియో, ఆడియోను పంపించారు. వారిని డీఐజీ మహేశ్వరి సస్పెండ్ చేశారు. చదవండి: యూట్యూబర్ మదన్‌కు రిమాండ్ -
నేరం నాది కాదు.. లాక్డౌన్ది
సేలం (తమిళనాడు) : కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి అప్పుల పాలయ్యారు. లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయి కుటుంబాన్ని పోషించేందుకు చేసిన అప్పులు తీర్చేందుకు కన్నకొడుకునే అమ్ముకున్న దీనగాథ తమిళనాడులోని సేలంలో వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఆరు నెలల పసికందుని లక్ష రుపాయలకు అప్పుతీర్చడం కోసం అమ్ముకున్నాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సదరు వ్యక్తిని, అతడికి సహాయం చేసిన స్నేహితుడిని, పిల్లాడిని కొన్నవారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లాలోని లైన్‌మెడు ప్రాంతంలో నివసిస్తున్న షౌకత్ అలీ భార్య షర్మిలా బానో ఆరు నెలల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. షర్మిల మామయ్య పిల్లాడిని చూడటానికి సోమవారం రాగా, వారితో అలీ వారం ముందే పిల్లాడు చనిపోయాడని చెప్పాడు. వారం రోజుల ముందే చిన్నారి చనిపోతే తమకు సమాచారం ఇవ్వకపోవడం, చుట్టుపక్కల ప్రజలకు కూడా ఈ విషయం తెలియకపోవడంతో అనుమానం వచ్చి అతని మామయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. షౌకత్, షర్మిలాను పోలీసులు గట్టిగా అడిగే సరికి ఇద్దరూ తమ బిడ్డను లక్ష రూపాయలకు అమ్మారని అంగీకరించారు. లాక్డౌన్ సమయంలో తాను ఉద్యోగం కోల్పోవడంతో, ఆర్థిక ఇబ్బందుల కారణంగా లక్ష రూపాయల వరకు అప్పు చేశానని, రుణం తిరిగి చెల్లించలేక బిడ్డను అమ్మాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. -
బతికి ఉండగానే ఫ్రీజర్‌లో.. మృతి
చెన్నై: బతికి ఉండగానే ఇరవై నాలుగు గంటల పాటు ఫ్రీజర్‌లో గడపాల్సిన దుస్థితిని ఎదుర్కొన్న తమిళనాడు వృద్ధుడు మరణించాడు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన, మృతి చెందినట్లు వైద్యులు శుక్రవారం ధ్రువీకరించారు. వివరాలు.. సేలం కందపట్టి హౌసింగ్ బోర్డుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి బాలసుబ్రమణ్య కుమార్ (70)కు పిల్లలు లేరు. గత ఏడాది ఆయన భార్య కూడా మరణించడంతో, తన సోదరుడు శరవణన్, ఇతర బంధువులతో కలిసి హౌసింగ్ బోర్డులో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో, కొన్ని రోజుల క్రితం బాలసుబ్రమణ్య కుమార్ అనారోగ్యం బారిన పడటంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో, ఆయన బతికే పరిస్థితి లేదని వైద్యులు తేల్చారు. (చదవండి: అంత్యక్రియలకు ఏర్పాట్లు.. మరోసారి కన్నీళ్లే ) దీంతో మంగళవారం ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. కాసేపటికి బాలసుబ్రమణ్య కుమార్ చలనం లేకుండా పడిపోవడంతో, తన అన్నయ్య మరణించినట్టేనని భావించిన శరవణన్, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. ఇందులో భాగంగా ఫ్రీజర్ బాక్స్‌ను ఇంటికి తెప్పించి, బాలసుబ్రమణ్య కుమార్ కాళ్లు, చేతుల కట్టి మృతదేహంలా చుట్టి అందులో పడుకోబెట్టాడు. అయితే ఆయన శరీరం చచ్చుబడ్డా, హృదయ స్పందన తెలుస్తుండటంతో, ఆ శబ్దం ఎప్పుడు ఆగుతుందా అని రాత్రంతా ఎదురు చూశాడు. (చదవండి: బతికే ఉన్న అన్నను ఫ్రీజర్‌లో పెట్టాడు...! ) ఈ క్రమంలో, బుధవారం ఉదయాన్నే ఫ్రీజర్ బాక్స్ అద్దెకు ఇచ్చిన వ్యక్తి, శరవణన్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో, బాలసుబ్రమణ్య కుమార్ శరీరంలో చలనం కనిపించడంతో, కళ్లు తెరచుకుని ఊపిరీ పీల్చలేని స్థితిలో ఉండటాన్ని గమనించి ఆందోళన చెందాడు. ఈ విషయం గురించి శరవణన్‌ను హెచ్చరించినప్పటికీ, ఆయన పట్టించుకోక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్రీజర్ బాక్స్‌లో ఉన్న బాలసుబ్రమణ్యను బయటకు తీసి, అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నేడు మృతిచెందారు. -
‘చనిపోయాడు.. కానీ ఆత్మ విడిచిపెట్టలేదు’
చెన్నై: కొన్ని సార్లు మన చుట్టుపక్కల జరిగే సంఘటనలు చూస్తే.. త్వరగా యుగాంతం వస్తే బాగుండు అనిపిస్తుంది. అంతటి దారుణాల మధ్య యాంత్రికంగా బతికేస్తున్నాం. ఇక వృద్ధుల పట్ల జరిగే దారుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒంట్లో ఓపిక ఉన్నన్ని రోజులు కుటుంబం కోసం శ్రమిస్తారు. వృద్ధాప్యంలో తన వారికి భారమవుతారు. ఈసడింపులు, ఛీత్కారాలు భరిస్తూ.. ఇంకా ఎన్ని రోజులు ఈ నరకం అని ఆ పండుటాకులు.. ఎప్పుడు పోతార్రా బాబు అని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తోన్న రోజులివి. అందరు ఇలానే ఉన్నారని కాదు. కానీ ఇలాంటి వారు కూడా ఉంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ వృద్ధుడి చావు కోసం ఎదురు చూస్తూ.. కుటుంబ సభ్యులు ప్రాణం ఉండగానే అతడిని శవాలను ఉంచే ఫ్రీజర్‌లో పెట్టి ఎప్పుడు కన్ను మూస్తాడా అని ఎదురు చూస్తున్న ఘటన సేలంలో చోటు చేసుకుంది. [ చదవండి: మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ ట్రిక్ తో సేఫ్ గా ఉండండి ] వివరాల్లోకి వెళితే...సేలం కందపట్టి హౌసింగ్ బోర్డుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి బాలసుబ్రమణ్య కుమార్ (70)కు పిల్లలు లేరు. గత ఏడాది భార్య ఉషా కూడా మరణించింది. దీంతో తన సోదరుడు శరవణన్, బంధువులు జయశ్రీ, గీతలతో కలిసి హౌసింగ్ బోర్డులో నివాసం ఉన్నారు. గత నెల బాలసుబ్రమణ్య కుమార్ అనారోగ్యం బారిన పడటంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆయన పరిస్థితి విషమించినట్టేనని, ఇక బతకడం కష్టం అని వైద్యులు తేల్చారు. దీంతో మంగళవారం ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. కాసేపటికి బాలసుబ్రమణ్య కుమార్ కోమాలోకి వెళ్లినట్టుగా పరిస్థితి మారింది. దీంతో ఇక, అన్నయ్య మరణించినట్టేనని భావించిన తమ్ముడు శరవణన్, అంత్యక్రియల ఏర్పాట్ల మీద దృష్టి పెట్టాడు. (చదవండి: వైరలవుతున్న కేరళ బామ్మ ఆవేదన) ముందుగానే ఏర్పాట్లు..... ముందుగా ఫ్రీజర్ బాక్స్‌ను ఇంటికి తెప్పించాడు. అందులో బతికే ఉన్న సోదరుడిని పడుకోబెట్టాడు. కాళ్లు చేతులు, కట్టి మృతదేహంలా ఆ బాక్స్‌లో పెట్టేశాడు. బాలసుబ్రమణ్య కుమార్ శరీరం చచ్చుబడ్డా, గుండె మాత్రం కొట్టుకుంటుండటంతో, ఆ శబ్దం ఎప్పుడు ఆగుతుందో అని రాత్రంతా ఎదురు చూశాడు. అయితే, బుధవారం ఉదయాన్నే ఆ ఇంటికి ఫ్రీజర్ బాక్స్ అద్దెకు ఇచ్చిన వ్యక్తి వచ్చాడు. ఈ సమయంలో బాలసుబ్రమణ్య కుమార్ శరీరంలో చలనం కనిపించడంతో, కళ్లు తెరచుకుని ఊపిరీ పీల్చలేని స్థితిలో ఉండటాన్ని చూసి ఆందోళన చెందాడు. శరవణన్‌ను హెచ్చరించాడు. ఆయన పట్టించుకోక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఫ్రీజర్ బాక్స్‌లో ఉన్న బాలసుబ్రమణ్యను బయటకు తీశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. శరశణన్ను అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులు విస్తుపోవాల్సి వచ్చింది. తన సోదరుడు చనిపోవడం ఖాయం అని వైద్యులు చెప్పేశారని, అందుకే ముందుగానే తాను ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందని, తమకు సాయంగా ఎవ్వరూ లేరని , అందుకే అన్ని ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నట్టు తెలిపాడు. ఈ సందర్భంగా దీవలింగం మాట్లాడుతూ.. "ఆ వ్యక్తిని రాత్రంతా లోపల ఉంచారు. ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ భయపడి నన్ను అప్రమత్తం చేశాడు. దీని గురించి అతడి కుటుంబ సభ్యులు ‘అతను చనిపోయాడు కానీ ఆత్మ ఇంకా విడిచిపెట్టలేదు అందుకే మేము వేచి ఉన్నాము' అని చెప్పారు" అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో సుమారు 24 మంది దుర్మరణం చెందారు. తిరుపూర్ జిల్లా అవినాషి వద్ద కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీ కొనడటంతో 19మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుప్పుర్, కోయంబత్తూరు ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సేలం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు నేపాల్‌వాసులు మృతి చెందారు. ఓమలూరు వద్ద కారు, బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. -
వైరల్ : టిక్‌టాక్‌లో కలెక్టర్
చెన్నై , టీ.నగర్: టిక్‌టాక్‌లో సేలం జిల్లా కలెక్టర్ ఫొటో చోటుచేసుకోవడం సోమవారం సంచలనం కలిగించింది. దీనిగురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సేలం జిల్లా కలెక్టర్ రోహిణి. ఈమె ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో టిక్‌టాక్ యాప్‌లో నమోదు చేశారు. కలెక్టర్ రోహిణి ఫొటోలు, ఆమె కుమారుడి ఫొటోలు కలిపి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, ఫేస్బుక్, టిక్‌టాక్ మ్యూజిక్, ట్విట్టర్లలో పోస్టు చేశారు. వీటిని గమనించిన కలెక్టర్ దిగ్భ్రాంతి చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోహిణి ఫోటోలతో ఉన్న టిక్‌టాక్ మ్యూజిక్‌ను నిషేధించే పనిలో సైబర్‌క్రైం పోలీసులు నిమగ్నమయ్యారు. రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇదివరకే అనేక మంది రాజకీయ ప్రముఖులు టిక్‌టాక్ యాప్‌ను రద్దు చేయాలని కోరుతున్న స్థితిలో ప్రస్తుతం కలెక్టర్ ఫొటోను టిక్‌టాక్ ఇతర సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం సంచలనం కలిగించింది. -
తమిళనాడులో 'యముడు' భయం ..
చెన్నై: వరద బీభత్సంతో అతలాకుతలమైన తమిళనాడును కొత్తగా యమధర్మరాజు భయపెడుతున్నాడు. తన వాహనం దున్నపోతుపై వచ్చి, ఇంటి యజమానుల ప్రాణాలను హరిస్తాడని ప్రజలు భయపడిపోతున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని స్థానిక పంచాంగకర్తలు కూడా నిర్ధారించారు. దీంతో జనం భయం మరింత రెట్టింపైంది. ప్రధానంగా సేలం జిల్లా అంతటా యముడు వస్తున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో మాంగల్యం కాపాడుకునేందుకు జిల్లాలోని మహిళలు బుధవారం తెల్లవారుజామునే నిద్ర లేచి, తలస్నానం ఆచరించి, ఇంటిముందు ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు. తమ తమ కుటుంబసభ్యులతో కలసి మహిళలు ఆంజనేయస్వామి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే బుధవారం రాత్రి దాకా యముడి జాడ ఎక్కడ కనిపించడపోవడంతో జిల్లా వాసులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అప్పట్లో వినాయకుడు పాలు తాగుతున్నాడని దేశవ్యాప్తంగా, మొన్నామధ్య ఇంటి పెద్దకొడుకుకు గండం ఉంటుందని తెలంగాణలో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో నేటి యముడి భయం కూడా అలాంటిదే. గుర్తుతెలియని వ్యక్తులు చేసే అసత్య ప్రచారాలను నమ్మి భయాందోళనలు గురి కావదంటూ ప్రజలకు పోలీసులు సూచించారు.