సాక్షి, ఢిల్లీ: దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు ఆమధ్య సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల బాండ్ల విషయంలో విధించిన డెడ్‌లైన్‌ను పొడిగించాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికల బాండ్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై.. చర్చనీయాంశమైన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఆ సమయంలో.. ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువు ఇచ్చింది.
ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్లపై వివరాలు అందిస్తే.. వాటిని వారం రోజుల్లో ఈసీ తన సైట్‌లో పొందుపర్చాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు విధించిన మూడు వారాల గడువు ప్రకారం.. మార్చి 6వ తేదీనే ఎస్బీఐ కేంద్ర ఎన్నికల సంఘానికి డాటా సమర్పించాల్సి ఉంది. అయితే ఇందుకు సమయం సరిపోదని.. జూన్ 30వ తేదీ దాకా గడువు ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది ఎస్‌బీఐ.
ఇక ఎస్‌బీఐ పిటిషన్‌పై సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ స్పందించారు. లంచాలు, కాంట్రాక్టులు పొందిన వివరాలు బయటపడతాయన్న భయంతోనే ఎన్నికలు ముగిసే వరకు సమయం కోరుతున్నారంటూ ఆరోపించారు.
ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..
Comments
Please login to add a commentAdd a comment