న్యూఢిల్లీ: జేఈఈ పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించినా ఒక్క రాంగ్ క్లిక్‌తో ఐఐటీ సీటు కోల్పోయిన సిద్ధాంత్ బత్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బత్రాకు మధ్యంతర ప్రవేశం కల్పించాలని కోర్టు ఐఐటీ బాంబేని ఆదేశించింది. జస్టిస్ ఎస్‌కే కౌల్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. ముందుగా బత్రాకు అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఐఐటీని ఆదేశించి తదుపరి విచారణను శీతాకాలం సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ప్రస్తుతం బత్రాకు ఇచ్చే అడ్మిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది.
ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బత్రాకు జేఈఈలో 270వ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించాడు. అయితే అక్టోబర్ 31న తన రోల్ నంబర్‌పై అప్‌డేట్ల కోసం నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా ఒక లింక్‌ను అనుకోకుండా క్లిక్ చేశాడు. ‘‘విత్ డ్రా ఫ్రం సీట్ అలకేషన్ అండ్ ఫర్‌దర్ రౌండ్స్’ అని ఉన్న లింక్‌ను తను క్లిక్ చేశాడు. ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింక్‌ను క్లిక్ చేసినట్లు బత్రా చెప్పారు. అయితే నవంబర్ 10న విడుదలైన 93మంది విద్యార్దుల తుది జాబితాలో బత్రా పేరు లేదు. దీంతో ఆయన బొంబాయి హైకోర్టులో పిటీషన్ వేశారు. 19న పిటిషన్ విచారించిన కోర్టు రెండురోజుల్లో బత్రా పిటిషన్‌ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటీని ఆదేశించింది.
అయితే విత్‌డ్రా లెటర్‌ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటీ గత నెల 23న బత్రా అప్పీలును తిరస్కరించింది. నిబంధనలు అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది. అడ్మిçషన్లన్నీ జేఒఎస్‌ఎస్‌ఏ చూసుకుంటుందని ఐఐటీ రిజిస్ట్రార్ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు. వచ్చేఏడాది జేఈఈకి బత్రా అప్లై చేసుకోవచ్చన్నారు. ఐఐటీ వాదనతో ఏకీభవించిన బాంబే హైకోర్టు తన అభ్యర్థనను కొట్టివేయడంతో బత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థనను మానవతా ధృక్పథంతో పరిశీలించాలని, తనకోసం అదనపు సీటు సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు విద్యార్ధికి అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment