సుప్రీంకోర్టు (పీటీఐ ఫైల్‌ఫోటో)
న్యూఢిల్లీ: కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పోర్నోగ్రఫీ కంటెంట్‌ని డైరెక్ట్‌గా ప్రసారం చేస్తున్నాయని.. కేంద్రం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయిన పొలిటికల్ డ్రామా ‘తాండవ్’లో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి.. వాటిని తొలగించాలంటూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తొలుత అలహాబాద్ హై కోర్టు తాండవ్ మేకర్స్‌కి, అమెజాన్ ప్రైమ్ ఇండియా ఉన్నత ఉద్యోగి అపర్ణ పురోహిత్‌కి నోటీసులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ అపర్ణ పురోహిత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో జస్టిస్ అశోక్ భూషన్ అధ్వర్యంలోని బెంచ్ గురువారం ఈ పిటిషన్‌ని విచారించింది. ఈ సందర్భంగా అశోక్ భూషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్ చూడటం సర్వసాధారణం అయ్యింది. కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్‌గా పోర్న్ కంటెంట్ ఉన్న వీడియోలను ప్రసారం చేస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ విచారణ కన్నా ముందే కేంద్రం తాజాగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు విడుదల చేసిన మార్గదర్శకాలను తమ ముందు ఉంచాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment