న్యూఢిల్లీ: కోవిడ్–19పై జాతీయవిధానం రూపొందించేందుకు సుమోటోగా తీసుకున్న కేసుపై కొందరు లాయర్లు విమర్శలకు దిగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవస్థ ఇలా నాశనమవుతోందంటూ వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం బార్ అసోసియేషన్‌లోని కొందరు సీనియర్ సభ్యుల తీరుపై విచారం వ్యక్తం చేసింది. ‘మా ఉత్తర్వులను మీరు చదివారు. కోవిడ్ సంబంధిత కేసులన్నిటినీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఉద్దేశం అందులో మీకు కనిపించిందా? ఆదేశాలను చూడకుండానే, అందులో లేని విషయాలపై విమర్శలకు దిగారు. ఈ వ్యవస్థ ఇలా నాశనమవుతోంది’అంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
కోవిడ్ సంబంధిత కేసుల విచారణ చేపట్టకుండా హైకోర్టులను తామెన్నడూ అడ్డుకోలేదని పేర్కొంది. అలాగే, జస్టిస్ బాబ్డేకు స్కూల్, కాలేజీ డేస్ స్నేహితులనే ముద్రను తనపై తొలగించుకునేందుకు ఈ కేసులో అమికస్ క్యూరీ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం కల్పించాలన్న సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వినతిని ధర్మాసనం ఆమోదించింది. కోవిడ్‌పై జాతీయ విధానం రూపొందించే విషయం లో కేంద్రం సమాధానం కోరుతూ ధర్మాసనం తదు పరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది.
వేదాంత నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేయండి
ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ అవసరం చాలా ఉందని, అందువల్ల తమిళనాడులోని వేదాంత స్టెర్లైట్ యూనిట్ నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలంటూ సుప్రీంకోర్టు తమిళనాడును కోరింది. ఆ యూనిట్ 2018 నుంచి మూతబడి ఉంది. అధిక వ్యర్థాలను విడుదల చేస్తోందన్న కారణంతో దాన్ని మూసేశారు. అయితే దాన్ని ప్రభుత్వం అదుపులోకి తీసుకొని అయినా ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని సూచించింది. ఈ కేసు వాదనలో పాల్గొన్న వేదాంత కంపెనీ సైతం.. తమ ప్లాంట్ తెరిస్తే వేలాది టన్నులను ఉచితంగా ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. అయితే ప్లాంట్ కారణంగా స్థానికంగా శాంతి భద్రతల సమస్య లు తలెత్తే సమస్య ఉందని ప్రభుత్వం వాదించింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ‘ఆ ప్లాంట్‌ను ఎవరు నడిపిస్తారన్నది మాకు అనవసరం. కానీ దాని నుంచి ఆక్సిజన్ మాత్రమే కావాలి. దేశ ప్రజలకు ఇది అత్యవసరం’ అని వ్యాఖ్యానించింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
( చదవండి: సుప్రీంకు అమెజాన్–ఫ్యూచర్ వివాదం )
Comments
Please login to add a commentAdd a comment