లక్నో: అమ్మను ఉరి తీస్తే నా పరిస్థితి ఏంటి.. ఈ ప్రశ్న చదువుతుంటేనే కడుపులో పేగు బాధతో మెలిపెడుతోంది కదా. అలాంటిది తన కళ్ల ముందే తల్లి చనిపోతుందని తెలిస్తే.. 12 ఏళ్ల ఆ చిన్నారి మనసు ఎంత విలవిల్లాడుతుందో ఊహించుకోండి. తల్లి లేకుండా అసలు బిడ్డలు తమ జీవితాన్ని ఊహించుకోలేరు. ఎన్ని జన్మలు అనుభవించినా తనివి తీరనది తల్లి ప్రేమ మాత్రమే. అలాంటి బంధం తర్వలోనే తనకు దూరం కాబోతుందని తెలిసి ఆ చిన్నారి విలవిల్లాడాడు. తన కోసం అయినా అమ్మను క్షమించాల్సిందిగా రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఇంతకు ఆ చిన్నారి ఎవరు.. ఎందుకు అతడి తల్లి చనిపోతుంది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.
నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా షబ్నం అనే పేరు మార్మోగుతుంది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్ష అనుభవించబోతున్న తొలి మహిళ షబ్నం. ఉత్తరప్రదేశ్ మథురలో నివాసం ఉండే ఈమె.. ప్రేమించిన వ్యక్తితో విహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో లవర్‌తో కలిసి వారిని హతమార్చిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల క్రితం అనగా 2008 ఏప్రిల్ 14న షబ్నం తన ప్రియుడు సలీంతో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును మథుర కోర్టు విచారించింది.
ఇక నిందితులు షబ్నం, ఆమె ప్రియడు ఇద్దరికి మరణశిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. 2010లో వచ్చిన మథుర కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. దోషులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఇదే రిపీట్ కావడంతో 2015లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చివరకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని క్షమాభిక్ష కోరారు. కానీ ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో త్వరలోనే వీరిని ఉరి తీయాల్సిందిగా మథుర కోర్టు, జైలు అధికారులను ఆదేశించింది.
ఇక కుటుంబ సభ్యులను హతమార్చే సమయానికే షబ్నం గర్భవతిగా ఉంది. జైల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. తనతో పాటే కుమారుడిని పెంచింది. అయితే ఖైదీగా ఉన్న తల్లి దగ్గర పిల్లలు ఆరు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం ఉండకూడదు. ఈ క్రమంలో 2015లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి షబ్నం కుమారుడిని ఎవరికైనా దత్తత ఇవ్వాలని భావించింది. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చింది. దాంతో షబ్నం కాలేజీ స్నేహితుడైన సైఫి, ఆమె కుమారుడి బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. పిల్లాడిని తనతో పాటు తీసుకెళ్లి పెంచసాగాడు.
ఈ సందర్భంగా సైఫి మాట్లాడుతూ.. ‘‘చదువుకునే రోజుల్లో ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా నేను చాలా వీక్‌గా ఉండేవాడిని. అప్పుడు షబ్నం నాకు ఎన్నో సార్లు డబ్బు సాయం చేసింది. ఆమె వల్ల నేను కాలేజీ చదువు పూర్తి చేయగలిగాను. ఆమె నాకు అక్క కన్నా ఎక్కువ. చదువు పూర్తయ్యాక నేను అక్కడి నుంచి వెళ్లి పోయాను. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిందని తెలిసి నేను షాక్ అయ్యాను. వెళ్లి ఆమెను కలవాలని అనుకున్నాను’’ అని తెలిపాడు. ప్రస్తుతం సైఫి బులంద్‌షహర్‌లో జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
‘‘ఇదే సమయంలో షబ్నం కుమారుడి దత్తతకు సంబంధించిన యాడ్ చూశాం. గతంలో తను నన్ను ఆదుకోకపోయి ఉంటే.. ఇప్పుడు ఇంత మంచి స్థితిలో ఉండేవాడిని కాదు. ఆమె నాకు చేసిన మేలుకు రుణం తీర్చుకునే అవకాశం లభించింది. ఆమె కుమారుడి బాధ్యత నేనే తీసుకోవాలనుకున్నాను. దీని గురించి నా భార్యతో కూడా మాట్లాడాను. ఆమె కూడా అంగీకరించింది’’ అని తెలిపాడు.
‘‘ఆ తర్వాత మేం భార్యభర్తలిద్దరం జైలుకు వెళ్లి షబ్నమ్‌ని కలిశాము. ఆమె కుమారుడిని మాతో పాటు తీసుకెళ్తాం.. అతడి బాధ్యతను మేం తీసుకుంటాం అని అడిగాం. ఆమె అంగీకరించింది. ఇక బాబును ఎన్నటికి అతడి తల్లి పుట్టిన ఊరికి తీసుకెళ్లకూడదని భావించాం. ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడకు తీసుకెళ్లలేదు. జైలులో తనకు పెట్టిన పేరు మార్చి.. తాజ్ అని పెట్టాం’’ అని తెలిపారు.
‘‘తల్లి గురించి తాజ్‌కు అన్ని వివరాలు తెలుసు. ఎంతైనా కన్న తల్లి కదా. ఆమె మీద ప్రేమను వదులుకోలేకపోతున్నాడు. ఇక తర్వలోనే షబ్నమ్‌ను ఉరి తీస్తారని తెలిసి ఆ చిన్నారి మనసు విలవిల్లాడుతుంది. అందుకే తన తల్లిని క్షమించాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కోరుతున్నాడు. ఈ మేరకు క్షమాభిక్ష పిటిషన్‌ని దాఖలు చేశాడు. పాపం అమ్మ చనిపోతే నా పరిస్థితి ఏంటంటూ ఆ చిన్నారి అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. అందుకే చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతూ రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశాడు. చూడాలి ఏమవుతుందో అన్నాడు’’ సైఫి.
చదవండి: ఏడుగురి హత్య: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి
న్యాయవాదుల హత్య: ఆ కేసులే కారణమా?
Comments
Please login to add a commentAdd a comment