పంజాబ్ ర్యాప్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా ఆదివారం ఉదయం ఘోర హత్యకు గురయ్యాడు. వీఐపీ కల్చర్‌కు ముగింపే పలికే క్రమంలో భాగంగా.. భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ దారుణం జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. సిద్ధూ మూసే వాలా నిర్లక్ష్యమే అతని ప్రాణం తీసినట్లు తేలింది.
పంజాబ్ మనసా జిల్లా మూసేవాలాకు చెందిన సిద్ధూ.. ఆదివారం గ్యాంగ్ వార్‌కి బలయ్యాడు. 29 ఏళ్ల ఈ యువ ర్యాపర్ గ్యాంగ్‌స్టర్‌లను ప్రొత్సహించేలా ర్యాప్‌లకు కడుతుంటాడు. అంతేకాదు మరణించే వరకు పలు వివాదాలు, కేసులతోనూ వార్తల్లో నిలిచాడు అతను.
సిద్ధూ మూసే వాలాతో పాటు 424 మందికి పంజాబ్ ప్రభుత్వం శనివారం వీఐపీ భద్రతను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయితే.. కొందరికి మాత్రం పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోలేదు. సిద్ధూకి నలుగురు భద్రతా సిబ్బంది ఉండగా.. ఇద్దరిని మాత్రమే వెనక్కి తీసుకుంది పంజాబ్ పోలీస్ శాఖ. అంతేకాదు అతనికి బుల్లెట్ వెహికిల్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కానీ, సిద్ధూ సిబ్బందిని, బుల్లెట్‌ఫ్రూఫ్ బండిని ఉపయోగించుకుండా.. తన ఇద్దరు స్నేహితులతో సాధారణ వాహనంలో బయటకు వెళ్లాడు. అదే అతని ప్రాణం తీసింది. జహవర్‌కే గ్రామం వద్ద వాహనంపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగలు. దీంతో సిద్ధూ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్.. ఈ దాడికి కారణమని పోలీసులు నిర్ధారించారు. లారెన్స్ బిష్ణోయ్ ఈ హత్య కుట్రలో భాగం అయ్యాడు అని పంజాబ్ డీజీపీ వీకే భర్వా మీడియాకు వెల్లడించాడు. బిష్ణోయ్ అనుచరుడు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బార్ ఈ హత్యకు కారకుడయ్యి ఉంటాడని చెప్తున్నారు. కిందటి ఏడాది జరిగిన విక్కీ మిద్ధుఖేరా హత్యకు ప్రతీకారంగానే సిద్ధూ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విక్కీ హత్య కేసులో మూసే వాలా మేనేజర్ షగన్‌ప్రీత్ పేరు ప్రముఖంగా వినిపించింది.
#WATCH | Punjab: A CCTV video shows two cars trailing Sidhu Moose Wala's vehicle moments before he was shot dead in Mansa district. pic.twitter.com/SsJag33XHb
— ANI (@ANI) May 30, 2022
ఇక సిద్ధూ మూసే వాలా హత్య కేసు దర్యాప్తునకు ఒక సిట్ బృందం ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.
సిద్ధూ మూసే వాలా అసలు పేరు సుభ్‌దీప్ సింగ్ సిద్ధూ. చిన్నవయసులోనే స్టార్ డమ్ దక్కింది అతనికి. అదే సమయంలో వివాదాలు, విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. గన్ కల్చర్‌తో పాటు గ్యాంగ్‌స్టర్‌లను హీరోలుగా అభివర్ణిస్తూ ర్యాప్ సాంగ్స్ కట్టాడు అతను. అంతేకాదు నాలుగు పంజాబీ సినిమాల్లోనూ నటించాడు. అతని ఆల్బమ్స్ మొత్తం హింసను ప్రేరేపించేవిగా ఉండేవి. అభ్యంతరకర కంటెంట్‌తోనూ విమర్శలు ఎదుర్కొన్నాడు అతను. సిక్కు తెగ వీరుల్ని అవమానించేలా ఉండడంతో క్షమాపణలు చెప్పాడు కూడా. ఇక లాక్‌డౌన్ టైంలో తన సెక్యూరిటీ సిబ్బంది దగ్గరి తుపాకులు తీసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చినందుకు ఆర్మ్స్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం.. కేసులు నమోదు అయ్యాయి. ఆ టైంలో అరెస్ట్‌కు బయపడి కొన్నాళ్లపాటు పరారీలో ఉన్నాడు అతను. ఆపై బెయిల్ దొరికాక బయటకు రాగా.. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులోనే ఉంది ఇంకా. సిద్ధూపై ఇంకా నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
పంజాబ్ ఎన్నికల ముందు 2021లో కాంగ్రెస్‌లో చేరిన సిద్ధూ మూసే వాలా.. ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఆప్ అభ్యర్థి డాక్టర్ విజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయాడు. సిద్ధూ మృతి కాంగ్రెస్ కీలక నేతలతో పాటు అతని అభిమానులను దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇదిలా ఉంటే.. సెక్యూరిటీ ఉపసంహరణే ఒక ప్రాణం బలి తీసుకుందంటూ ప్రత్యర్థులు ఆరోపిస్తుండగా.. దయచేసి సంయమనం పాటించాలని, దోషులు ఎంతటి వాళ్లైనా వదిలే ప్రసక్తే లేదని పిలుపు ఇచ్చాడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.
I am Shocked and Deeply saddened by the gruesome murder of Siddhu Moosewala. Nobody involved will be spared. My thoughts and prayers are with his family and his fans across the world. I appeal everyone to stay calm.
— Bhagwant Mann (@BhagwantMann) May 29, 2022
Comments
Please login to add a commentAdd a comment