బెంగళూరు: భయంకరమైన దృశ్యం.. కొద్దిపాటిలో కోబ్రా కాటు నుంచి తప్పించుకున్న స్నేక్ క్యాచర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పామును కాపాడబోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఈ వీడియోను న్యూస్ ఎజెన్సీ ఏఎన్‌ఐ బుధవారం షేర్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షకుపైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఆ కోబ్రా బుస్సు మంటు వారి మీదకు లేచిన దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరికి గుండె ఆగిపోయినంత పనైంది. ఇక విషపూరితమైన కోబ్రాతో ధైర్యంగా పోరాడి ప్రాణాలతో బయటపడిని స్నేక్ క్యాచర్, మరో వ్యక్తిపై నెటిజన్‌లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘నిజంగా వీరిద్దరి ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే. ధైర్యంగా ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒకవేళ ఆ సమయంలో వారిద్దరు బయపడి ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్ పెడుతున్నారు.
ఈ వీడియో ప్రకారం... కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని ఓ అడవిలో పెద్ద చెట్టు బెరడులో కోబ్రా ఇరుక్కుపోయింది. అది చూసిన ఓ స్నేక్ క్యాచర్ దానిని రక్షించడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో మరో వ్యక్తి వెనక నుంచి వచ్చి పాము తోక పట్టుకున్నాడు. దీంతో వెంటనే కోబ్రా కోపంతో స్నేక్ క్యాచర్ మీదకు లేచింది. చెట్టు బెరడుపై నిలుచున్నఅతడిపైకి లేచి బుస్సుమంటు మోకాలుపై కాటు వేయబోయింది. అయితే స్నేక్ క్యాచర్ దానిని వెంటనే చేతితో నీళ్లలోకి దూరంగా కొట్టాడు. ఆ ప్రయత్నంలో తూలి కిందపడిపోగా పాము అతడి మీదకు మరోసారి వెళ్లి కాటు వేయబోయింది. అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి వెంటనే దాని తలను పట్టుకునే ప్రయత్నం చేయగా మళ్లీ తప్పించుకుంది. అప్రమత్తమైన స్నేక్ క్యాచర్ వెంటనే పాము తలను గట్టిగా చేతితో పట్టుకున్నాడు. దానిని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment