ఎనిమిది నెలల బాలికను రూ.90 వేలకు విక్రయించిన కేసులో జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ పోలీసులు ఇద్దరు మహిళలు, ఒక యువకుడిని అరెస్టు చేశారు. పోలీసులు ఆ బాలికను స్వాధీనం చేసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఆ బాలిక తండ్రి రాహుల్ సాహ్ని ఇచ్చిన ఫిర్యాదులో తాను ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపాడు. నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగిందని, అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నానని పేర్కొన్నాడు. 2023, డిసెంబర్‌లో తన భార్య తమ ఎనిమిది నెలల కుమార్తె అనన్యతో కలిసి హజారీబాగ్‌లోని పుట్టింటికి వెళ్లిందని పేర్కొన్నాడు. అయితే 2024, ఫిబ్రవరి 11న తన భార్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తమ కుమార్తె అనన్య కుమారి ఆమెతో లేదని తెలిపాడు.
బాలిక తండ్రి రాహుల్ సాహ్ని తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం అతని భార్య పుట్టింటి నుండి తిరిగి వచ్చిన తరువాత.. ఆమెను కుమార్తె గురించి అడిగినప్పుడు.. కొన్ని రోజుల క్రితం రాహుల్ కుమార్ రామ్, రీటా దంపతులు తనను సంప్రదించారని.. వారు నీ భర్త కాలు విరిగిందని, మీ పరిస్థితి బాగోలేదని చెబుతూ , తమ కుమార్తెను వారికిస్తే జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారని, భర్త ఆరోగ్యం కుదుటపడ్డాక, కుమార్తెను తిరిగి తీసుకువెళ్లవచ్చని చెప్పడంతో ఆమె కుమార్తెను వారికి అప్పగించిందని తెలిపాడు.
తన భార్య తమ కుమార్తె అనన్య కుమారిని రామ్‌ఘర్ టేకర్ స్టాండ్ దగ్గర ఆ దంపతులకు అప్పగించినట్లు రాహుల్ సాహ్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత భర్త.. భార్యను మందలించి, రాహుల్ కుమార్, రీటాదేవిలను సంప్రదించగా, వారు తాము ఆ చిన్నారిని రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్ దంపతులకు రూ.90 వేలకు విక్రయించినట్లు తెలిపారు.
రాహుల్ కుమార్, రీటా దేవిలు తన భార్యను ప్రలోభపెట్టి, ఆమె వద్ద నుంచి తమ కుమార్తెను తీసుకుని.. రీనా కుమారి, గౌతమ్ కుమార్‌లకు అమ్మేశారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నాడు. రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్‌లు రాహుల్ కుమార్ రామ్‌కు బంధువులు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బాలికను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలికను తండ్రికి అప్పగించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. అయితే ఆ బాలికను ఆమె తల్లే విక్రయించిందా? లేక ఇతరులు బాలిక పెంపకం సాకు చూపి, ప్రలోభాలకు గురిచేసి విక్రయించారా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో ఒక నిందితుడు పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment